మీ వల్లే నష్టం.. కాదు మీవల్లే ఓడిపోయాం!

21 Jan, 2017 04:06 IST|Sakshi

కాంగ్రెస్‌ నేతలు పొన్నం – అనిల్‌ వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ముఠా తగాదాలు బట్టబయలవు తున్నాయి. శుక్రవారం అసెంబ్లీలోని కాం గ్రెస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలోనే ఇద్దరు నేతలు పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. తెలంగాణలో పార్టీకి మీవల్లే అంటే... మీవల్లనే నష్టం జరిగిందని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,  ప్రభుత్వ మాజీవిప్‌ ఈరవత్రి అనిల్‌ వాదనకు దిగారు. ఆర్బీఐ ఎదుట పార్టీ ధర్నా తర్వాత అసెంబ్లీలోని కార్యాలయానికి కొందరు నాయకులు వెళ్లా రు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ మాజీవిప్‌ అనిల్‌ తదితరుల మధ్య మొదలైన రాజకీయ చర్చ క్రమంగా వేడెక్కిం ది.

తెలం గాణలో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి అప్పట్లో ఎంపీలుగా ఉన్నవారే కారణమని, కాంగ్రెస్‌ ఎంపీలుగా ఉన్నవారంతా కేసీఆర్‌ ఎజెండాను మోయడం వల్లనే పార్టీ నష్టపోయిందని పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి అనిల్‌ వ్యాఖ్యా నించారు. ‘అనిల్‌తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి మద్దతు ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌ ఓడిపోయిం దని పొన్నం బదులిచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుకూల ప్రకటన చేసిన తర్వాతనే ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో తాము డిమాండ్‌ చేశామన్నా రు. దీనిపై అనిల్‌ స్పందిస్తూ ‘తెలంగాణకు అధిష్టానం నుంచి అనుకూలంగా ప్రకటన వచ్చిన తర్వాత మేం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినం. కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎంని చేసింది కూడా హైకమాండేనని మరి చిపోయి మాట్లాడితే ఎట్లా’ అని ప్రశ్నించారు.

కిరణ్‌పై చర్య తీసుకునుంటే...
భట్టి జోక్యం చేసుకుని ‘అప్పుడు ముఖ్యమం త్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగడంవల్ల మేమంతా అనివార్యంగా సహకరించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనకు అధిష్టానం అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాక దానిని వ్యతిరేకించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై చర్య తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని అన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు అనుకూలంగా అప్పట్లో కేకే, వివేక్‌ వంటివారు నివేదికలను ఇచ్చారని అన్నారు. అనిల్‌ మాట్లాడుతూ ‘అప్పుడు ఎంపీగా ఉన్న పొన్నం వంటివారంతా కేసీఆర్‌ ఎజెండాను మోశారు. ఇప్పటికీ వారు కేసీఆర్‌ ఎజెండానే మోస్తున్నారు. అప్పటి ఎంపీలు స్వంత ఇమేజ్‌కోసం కేసీఆర్‌ ఎజెండాను మోశారు.

దీనిని కేసీఆర్‌ వాడుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందనే అంశం ప్రజలకు అర్థం కాకపోవడానికి టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎంపీలు సమర్థించడమే కారణం. ఇప్పటికీ పొన్నం అదే దారిలో ఉన్నారు’ అని ఆరోపించారు. దీనిపై పొన్నం స్పందిస్తూ ‘కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వచ్చిందనడానికి మేము చేసిన పోరాటమే నిదర్శనం. ఇంకా కాంగ్రెస్‌పై సానుభూతి ఉండటాని మేమే కారణం’ అని జవాబిచ్చారు.

మరిన్ని వార్తలు