కిడ్నాప్ కేసులో కాసుల దందా

30 Sep, 2014 04:36 IST|Sakshi
కిడ్నాప్ కేసులో కాసుల దందా

నిందితుడి తరఫువారిని బెదిరించి రూ.లక్షకుపైగా వసూలుచేసిన పొన్నూరు అర్బన్ సీఐ
వ్యవహారం మీడియాలో రావడంతో పరార్

 
సాక్షి, హైదరాబాద్/పొన్నూరు: ఓ యువతి కిడ్నాప్ కేసులో గుంటూరు రూరల్ జిల్లా పొన్నూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ హుస్సేన్ కాసుల దందాకు దిగారు. నిందితుడి కుటుంబాన్ని బెదిరించి, భయపెట్టి రూ.లక్షకు పైగా వసూలు చేశారు. ‘మీకు అనుకూలంగా వ్యవహరిస్తా..’ అంటూ హామీ ఇచ్చేశారు. ఈ వ్యవహారం మొత్తం నిఘా కెమెరాలో రికార్డు కావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడి తండ్రి ‘సాక్షి’ మీడియూను ఆశ్రరుుంచడంతో సీఐ బండారం బట్టబయలైంది. వివరాలు.. ఓ యువతిని కిడ్నాప్ చేసినట్లు పొద్దుటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పుట్ల అనీష్‌కుమార్‌పై గతేడాది సెప్టెంబర్ 25వ తేదీన పొన్నూరు అర్బన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరు నెలలు గడిచినా నిందితుడ్ని అరెస్టు చేయలేదు.

ఈలోపు నిందితుడి తండ్రితో సీఐ బేరసారాలకు దిగాడు. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ రాదని, నిందితుడు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తే వీసా విషయంలో పట్టుబడేలా చేస్తానంటూ బెదిరించాడు. వేళాపాళా లేకుండా కానిస్టేబుళ్లను పంపడం, తరచూ పోలీసుస్టేషన్‌కు రమ్మనడం లాంటి చర్యలకు దిగాడు. నిందితుడి కుటుంబం ఆరు నెలల పాటు సీఐ వేధింపులు ఎదుర్కొంది. ఎట్టకేలకు హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ పొందాడు. ఈ మేరకు అనీష్ ప్రతి ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది. సీఐ హుస్సేన్‌కు ఈ అంశం అనుకూలంగా మారింది.

సంతకం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చే అనీష్‌కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. గంటల తరబడి వేచి ఉండేలా చేయడం, నిందితుడితో పాటు అతడి తండ్రినీ దుర్భాషలాడటం పరిపాటిగా మారింది. వీటితో విసిగి వేసారిన అనీష్ తండ్రితో సీఐ బేరసారాలకు దిగాారు. ‘నేను ‘చెప్పినట్లు చేస్తే’ అన్నీ చిటికెలో పరిష్కారం అవుతాయని, ఇప్పటి వరకు ఫిర్యాదుదారులకు అనుకూలంగా ఉన్న తాను ఇకపై మీకు అనుకూలంగా మారతానని చెప్పుకొచ్చారు. కిడ్నాప్ కేసులో దర్యాప్తు పూర్తిచేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. అనివార్య కారణాల నేపథ్యంలో దీన్ని కోర్టు తిరస్కరించింది.

అది కూడా తన క్రెడిట్‌గా చెప్పుకున్న సీఐ.. మరో అభియోగపత్రంలో మీకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.1.5 లక్షలు డిమాండ్ చేశారు. నగదు ఇవ్వడానికి అంగీకరించిన అనీష్ తండ్రి రెండు విడతల్లో లక్షకు పైగా వరకూ ముట్టజెప్పారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో నిఘా కెమెరాలను ఆశ్రరుుంచారు పలు దఫాలుగా సీఐతో జరిపిన సంప్రదింపుల దృశ్యాలు, డబ్బు ఇస్తున్న దృశ్యాలను రికార్డు చేశారు. సీఐ హుస్సేన్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ వీటిని ‘సాక్షి’ టీవీకి సోమవారం అందించారు. ఈ బాగోతంపై ‘సాక్షి’ కథనం ప్రసారం చేయడంతో సీఐ జంప్ అయ్యారు. వివరాలు అడిగేందుకు మీడియా సీఐని కలిసే ప్రయత్నం చేయగా బూట్లు కూడా వేసుకోకుండా దొడ్డిదారిన పరారయ్యారు. కాగా, సీఐ హుస్సేన్‌ను రూరల్ ఎస్పీ రామకృష్ణ వీఆర్‌లో ఉంచారు.

మరిన్ని వార్తలు