పూర్ణిమ కేసులో మలుపు

15 Jul, 2017 09:17 IST|Sakshi
పూర్ణిమ కేసులో మలుపు

అదృశ్యం కాదు... కిడ్నాప్‌
కేసును మార్చిన పోలీసులు

హైదరాబాద్‌ (జగద్గిరిగుట్ట): గత 40 రోజులుగా ఆందోళన కల్గిస్తున్న విద్యార్థిని పూర్ణిమ (15) అదృశ్యం కేసును బాచుపల్లి పోలీసులు కిడ్నాప్‌ కేసుగా మార్చినట్లు సీఐ బాలక్రిష్ణారెడ్డి తెలిపారు. జూన్‌ 7వ తేదీన నిజాంపేట్‌కు చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారిల కుమార్తె పూర్ణిమ సాయి తమ ఇంటి పక్కనే గల ఓ ప్రైవేటు పాఠశాలకు అని వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం పూర్ణిమ తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి తమదైన కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

రోజులు గడుస్తున్నా పూర్ణిమ ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 18 బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొంటున్నారు. అయినా చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో గురువారం పూర్ణిమ తల్లిదండ్రులు చొల్లంగి నాగరాజు, విజయకుమారిలు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్‌ కేసును పోలీసులు కిడ్నాప్‌ (ఐపీసీ 366) కేసుగా మార్చారు. దర్యాప్తును మరో కోణంలో చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఇద్దరిపైనే అనుమానాలు..
తమ కుమార్తె అదృశ్యానికి సంబంధించి ఆమె చదువుతున్న పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘం నాయకురాలు రేఖ సైతం పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని, పూర్ణిమ చదువుతున్న భాష్యం స్కూల్‌లో ఎందుకు లేవని అచ్యుతరావు ప్రశ్నించారు. బాలిక అదృశ్యం తర్వాత యాజమాన్యం స్పందించి సీసీ కెమెరాలు అమర్చిందని, ముందే ఈ పని చేస్తే తమ కేసులో ఉపయుక్తంగా ఉండేదని పూర్ణిమ తల్లిదండ్రులు చెప్తున్నారు. బాలిక మిస్సింగ్‌ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబడుతోంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా