నగరం నుంచి అశ్లీల చిత్రాల అప్‌లోడ్‌

18 Jan, 2017 07:30 IST|Sakshi
నగరం నుంచి అశ్లీల చిత్రాల అప్‌లోడ్‌
  • వేలకొద్దీ షేర్‌ చేస్తున్న అమెరికా ఉద్యోగి
  • మాదాపూర్‌లో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు
  •  29,288 పోర్న్‌ వీడియోలు స్వాధీనం
  • సాక్షి, హైదరాబాద్‌: చిన్న పిల్లల అశ్లీల, నీలి చిత్రాలు, ఫొటోలను సేకరించి వివిధ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్న అమెరికా ఉద్యోగిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 29,288 చైల్డ్‌ పోర్నోగ్రఫీ చిత్రాలున్న ల్యాప్‌టాప్, ఐఫోన్, హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్‌కిర్క్‌ జాన్స్‌ మాదాపూర్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీలో లీగల్‌ విభాగంలో కీలక అధికారిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చైల్డ్‌ పోర్నోగ్రఫీకి అలవాటుపడ్డాడు. కొద్ది రోజులుగా చిన్న పిల్లల నగ్న, అశ్లీల చిత్రాలను పోర్న్‌ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసి... వాటిని తిరిగి ట్విట్టర్, గిగాట్రైబ్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్నట్టు గత నెలలో ఢిల్లీలోని సీబీఐ, ఇంటర్‌పోల్‌ అధికారులు గుర్తించారు. వారు వెంటనే రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐటీ యాక్ట్‌ 67 (ఏ), (బి)కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

    490 గిగాట్రైబ్‌... 24 ట్విట్టర్‌ ఖాతాలు...
    ఈ మేరకు సీఐడీ అధికారులు మంగళవారం జేమ్స్‌ నివాసంలో సోదాలు నిర్వహించారు. అతడు 490 గిగాట్రైబ్, 24 ట్విట్టర్‌ ఖాతాల్లో చిన్నపిల్లల అశ్లీలచిత్రాలను షేర్‌ చేసినట్టు గుర్తించారు. వెంటనే జేమ్స్‌ను అరెస్టు చేసి, జ్యుడీషియల్‌ కస్టడీకి పంపినట్టు సీఐడీ ఐజీ తెలిపారు. అతడి నుంచి 29,288 అశ్లీల చిత్రాలున్న ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు