ఛిద్రం.. జర భద్రం

12 Sep, 2015 23:54 IST|Sakshi
ఛిద్రం.. జర భద్రం

రోడ్లపై గుంతలు  పొంగుతున్న నాలాలు
ఏటా తప్పని కష్టాలు  మేలుకోని అధికారులు
ఇదీ విశ్వ నగర ‘చిత్రం

 
అడుగడుగునా గుంతలు... మడుగులను తలపించేలా నీళ్లు... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... వెన్ను విరిగే ప్రమాదం... ఇదీ మహా నగర రహదారుణ చిత్రం. వాన దెబ్బతో ‘విశ్వ’నగరం అసలు రూపం మరోసారి బట్టబయలైంది. రోడ్లపై గోతులు గ్రేటర్ దుస్థితిని తెలియజెప్పాయి. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది. యంత్రాంగం పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తి చూపింది.
 
’సాక్షి, సిటీబ్యూరో:
 బంజారాహిల్స్...జూబ్లీహిల్స్...బాలానగర్... ఎల్‌బీనగర్... ఏ మార్గమైనా ఒకటే రూపం. కాలు కింద పెడితే ఏ గోతిలో దిగిపోతామోననే భయం. వాహనం బయటకు తీస్తే ఏ గుంతలో పడి... ఎముకలు విరగ్గొట్టుకుంటామోననే భీతి. ఇదీ మహానగరంలో వర్షం వస్తే ప్రజల దుస్థితి. దారి పొడవునా గోతులు... నిలిచిపోయే నీళ్లు వాహనదారులకు, పాదచారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. ఫ్లై ఓవర్ల వైపు చూస్తున్న అధికారులు...ప్రజాప్రతినిధులు నాలాలు, రహదారులపై దృష్టి సారించ డం లేదు. దీంతో నగర ప్రజలకు అవస్థలు తప్పడం లే దు. వానా కాలంలో సమస్యలు తలెత్తకుండా వేసవిలోనే చర్యలు తీసుకోవాలి. నాలాల్లో పూడిక తొలగింపు... లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన మరమ్మతులు చేస్తే చాలా వరకు సమస్యలు తలెత్తవు. కానీ ఈ దిశగా యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు.  
 
షరా మామూలుగా నాలాలు
సీజనల్ సమస్యల నుంచి బయట పడేందుకు చేపట్టాల్సినతాత్కాలిక పనులు కూడా లేకపోవడంతో ప్రజలకు కడగండ్లు తప్పడం లేదు. ఏటా నాలాల్లో పూడికతీత పనుల పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ... వర్షం వ స్తే నీరు వెళ్లే మార్గం లేదు. దీంతోఅవి పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి.
 
 ఈ ఏడాది 749 కి.మీ. మేర పనులు చేపట్టాల్సి ఉంది. ఏ మేరకు జరిగాయో అధికారులకే తెలియాలి. నగరంలోని నాలాలు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించుకుపోయాయి. ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి.
 
30 నాలాలున్నా వివరాల్లేవు..

గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలు ఉన్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప... కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. ఈ నాలాల వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది.
 
కంకర తేలి...
బంజారాహిల్స్: భారీ వర్షాలకు రోడ్లపైన తారు కొట్టుకుపోవడంతో కంకర తేలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లు అడుగడుగునా దెబ్బతిన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పది రోజుల క్రితమే బీటీ రోడ్డు వేశారు. నాలుగు రోజుల క్రితం పైప్‌లైన్ కోసం తవ్వి గాలికి వదిలేశారు. ఇటీవల వర్షాలకు రోడ్డంతా కొట్టుకుపోయి వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది.
 
అటు వె ళ్లాలంటే భయం

దూలపల్లి: నర్సాపూర్ రాష్ట్ర రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి గండిమైసమ్మ వరకు గల రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం ఈ రహదారి గుండా మెదక్, బోధన్, నిజామాబాద్‌లకు ఆర్టీసీ బస్సులు, లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలతో వాహనాల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయ పడుతున్నారు. వర్షం పడితే ఇక వారి ఇబ్బందులు చెప్పనలవి కాదు. రహదారులను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.స్వచ్ఛ హైదరాబాద్ పర్యటనల్లోనూ నాలాలను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్యాచరణ మొదలు కాలేదు.
 
 అమలు ఎప్పుడో..
 తొలి దశలో 350 కి.మీ. మేర నాలాలను అభివృద్ధి చేయాలని గత నవంబర్‌లో నిర్ణయించారు. దశల వారీగా పనులు చేయాలనుకున్నారు. దీనికి ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. కానీ వారెక్కడ పని చేస్తున్నారో తెలియడం లేదు. ఈ పరిస్థితులతో వానొచ్చిన ప్రతిసారీ నగర ప్రజలకు సంతోషం కంటే.. ఇంటి నుంచి బయటకు వెళితే...తిరిగి రాగలమా? అనే సందే హమే వేధిస్తోంది.
 
 
 వెన్నువిరుస్తున్న రహదారులు

 అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు... గత నాలుగైదు రోజులుగా కురిసిన వానతో మరింత దెబ్బతిన్నాయి. గుంతలు మరింత ఎక్కువై... కంకరతేలిన రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలిపోతున్నారు. వాహనదారులు గోతుల్లో పడి వెన్ను విరగ్గొట్టుకుంటున్నారు. మెట్రో పనులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, కేబుల్ సంస్థలు రోడ్లను ఇష్టానుసారం తవ్వి పారేస్తున్నాయి. వర్షం పడినప్పుడు నీరు నిలిచి... ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు