పరిశ్రమలపై మరో పిడుగు!

8 Oct, 2014 00:54 IST|Sakshi
పరిశ్రమలపై మరో పిడుగు!

నేటి నుంచి వారానికి రెండు రోజులు పవర్ హాలీడే
 
సిటీబ్యూరో: అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పారిశ్రామిక రంగంపై తాజాగా మరో పిడుగు పడింది. ప్రస్తుతం వారానికి ఒక్క రోజు పవర్ హాలీడే ఉండగా.. దాన్ని రెండు రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోతలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ కంపెనీ ప్రకటించింది. రంగారెడ్డి నార్త్, రంగారెడ్డి ఈస్ట్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిళ్ల పరిధిలో ఆది, సోమవారాల్లో పవర్ హాలీడే ఉండగా.. రంగారెడ్డి సౌత్‌లో శుక్ర, శనివారాల్లో ఈ కోతలు అమలులో ఉంటాయి.

గృహాలకు నిత్యం ఉదయం 2, మధ్యాహ్నం 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు యధావిధిగా కొనసాగుతాయి. విద్యుత్ సరఫరా, డిమాండ్‌కు మధ్య పెరిగిన వ్యత్యాసం వల్లే కోతల వేళలు పెంచాల్సి వచ్చిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తాజా విద్యుత్ కోతలపై పారిశ్రమిక వర్గాలు, గృహ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. కోతల పెంపుతో పరిశ్రమల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది.   
 

మరిన్ని వార్తలు