విద్యుత్ ఉద్యోగులపై నియంత్రణ ఎత్తేయాలి

12 Mar, 2016 02:00 IST|Sakshi
విద్యుత్ ఉద్యోగులపై నియంత్రణ ఎత్తేయాలి

ఈఆర్‌సీని కోరిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ముందు విద్యుత్ ఉద్యోగులు హాజరుకాకుండా నియంత్రించాలని కోరుతూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు జారీ చేసిన అడ్వయిజరీని ఉపసంహరించుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. టీజేఏసీ ప్రతినిధి బృందంతో కలసి శుక్రవారం ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వేదికగా పనిచేయాల్సిన ఈఆర్‌సీ వివాదాలకు వేదికగా మారకూడదన్నారు. విద్యుత్ ఉద్యోగులను నియంత్రించాలని గత నెల 9న ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ట్రాన్స్‌కో యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందన్నారు.

చట్టబద్ధమైన ఈఆర్‌సీ ముందు విద్యుత్ ఉద్యోగులు హాజరై తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విసృ్తత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సర్వీసు రూల్స్ పేరుతో ఉద్యోగులను చర్చల్లో అనుమతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారిని ఉద్యోగులుగా కాకపోయినా వినియోగదారుల హోదాలోనైనా చర్చలో పాల్గొనేందుకు అనుమతించాలని కోరారు. లేదంటే బహిరంగ విచారణ హేతుబద్ధత కోల్పోతుందన్నారు. చైర్మన్‌ను కలసిన వారిలో తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.రఘు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, టీజేఏసీ సీనియర్ నేత వెంకట్‌రెడ్డి ఉన్నారు.

>
మరిన్ని వార్తలు