అంగన్‌వాడీల్లో ప్రీ-స్కూలింగ్

20 Jun, 2015 01:46 IST|Sakshi
అంగన్‌వాడీల్లో ప్రీ-స్కూలింగ్

* నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ
* ఒకటో తరగతిలో ప్రవేశానికి వీలుగా సర్టిఫికేట్లు
* ‘అంగన్‌వాడీ-బడిబాట’ పేరిటవిస్తృతంగా ప్రచారం

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగానే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి.. ప్రీ-స్కూలింగ్ తరగతులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రాధమిక పాఠశాలల్లో కాకుండా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రీ-స్కూలింగ్ తరగతులను కూడా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది.

ప్రీ-స్కూలింగ్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా సుమారు 11 లక్షల మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. వీరిలో మూడు నుంచి ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు ఆరు లక్షల మంది ఉన్నారు. వీరందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే ప్రీ-స్కూలింగ్ తరగతులకు నమోదు చేయాలని మహిళా శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది.

అంగన్‌వాడీ-బడిబాట పేరిట విద్యార్థుల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ను అధికారులు చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూలింగ్ పూర్తి చేసుకున్న చిన్నారులు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోనైనా చేరేందుకు చెల్లుబాటయ్యేలా సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. ప్రీ-స్కూలింగ్ సర్టిఫికెట్ల జారీ విషయమై విద్యాశాఖతో సంప్రదింపులు జరిపాకే మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
 
జూలై 1 నుంచి ‘ఆరోగ్యలక్ష్మి’...
గర్భవతులు, బాలింతలకు సమృద్ధిగా పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులందరినీ సదస్సుల్లో భాగస్వాములను చేయాలని అధికారులు నిర్ణయించారు.

జూన్ చివరి వారం నుంచి లేదా జూలై 1 నుంచి ఈ సదస్సులను ప్రారంభించనున్నట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. కాగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లకు ఇటీవల ప్రభుత్వం పెంచిన వేతనాలను ఇప్పటికే విడుదల చేశామని, ఈ నెల 22 నుంచి వారి బ్యాంకు ఖాతాలకే వేతన సొమ్ము జమ చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు