పల్లె వైద్యానికి ప్రాధాన్యం!

6 Mar, 2017 04:11 IST|Sakshi
పల్లె వైద్యానికి ప్రాధాన్యం!

వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్‌ రూ.9,686 కోట్లు
గతేడాది కంటే రూ. 2,244 కోట్లు అధికం
వైద్య విద్యకు, ఆరోగ్య,కుటుంబ సంక్షేమానికే పెద్దపీట


సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ 2017–18 సంవత్సరానికి రూ. 9,686.71 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. గతేడాది బడ్జెట్‌ రూ. 7,442 కోట్లు కాగా... ఈసారి అదనంగా రూ. 2,244 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ. 3,941.34 కోట్లు కేటాయించగా... ప్రగతి పద్దు కింద రూ. 5,475.36 కోట్లు కేటాయిస్తారని తెలిసింది. బడ్జెట్లో వైద్య విద్యకు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు. వైద్య విద్య నిర్వహణ పద్దు కింద రూ. 1,755.73 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 1,955.74 కోట్లు కేటాయిస్తారని తెలిసింది.

ఇక ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి నిర్వహణ పద్దు కింద రూ. 312 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 1,939 కోట్లు కేటాయిస్తారు. ప్రధానంగా వైద్య విద్యపై సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది పోస్టుల భర్తీ చేపడతారు. పదోన్నతులు కల్పిస్తారు. వైద్య విద్య, పరిశోధనపై సర్కారు దృష్టి సారించింది. బోధనాసుపత్రులను మరింత అభివృద్ధి చేస్తారు. నిమ్స్‌లో రూ. 150 కోట్లతో నిర్మాణాలు చేపడతారు. ఎంఎన్‌జేలో రూ. 23 కోట్లతో భవనాలు నిర్మిస్తారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం..
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కోసం కూడా అధికంగా నిధులు కేటాయించ నున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. సర్కారు ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించుకుంటే రూ. 12 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అందులో కేంద్రం నుంచి రూ. 6 వేలు వచ్చినా మిగిలిన సొమ్ము కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. బేబీ కిట్ల కోసం కూడా ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రగతి పద్దు కింద రూ. 652 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 380 కోట్లు కేటాయిస్తారని తెలిసింది.

ఇక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మాత్రం కేవలం రూ. 60 కోట్లే కేటాయిస్తారు. ఆయుష్‌ కోసం ప్రగతి పద్దు కింద కేవలం రూ. 78 కోట్లే కేటాయించనున్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని మరింత విస్త్రృతం చేసేందుకు కూడా బడ్జెట్లో కేటాయింపులు బాగానే ఉంటాయని చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌ నగరంలో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వీటి నిర్మాణాలకు రుణం తీసుకునేందుకు వివిధ జాతీయ బ్యాంకులతో వైద్య ఆరోగ్యశాఖ చర్చలు జరుపుతోంది.

మరిన్ని వార్తలు