‘పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే’కు హరిత శోభ

22 Jun, 2017 04:22 IST|Sakshi
‘పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే’కు హరిత శోభ

- పిల్లర్ల మీద వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు సన్నాహాలు
- హెచ్‌ఎండీఏ, బెంగళూరు ‘సే ట్రీస్‌’ బృందం అధ్యయనం


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను జీవవైవిధ్య నగరంగా మలిచేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రిస్తూనే, మరోవైపు పచ్చదనంతో నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పీవీ నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలో గ్రీన్‌వాల్స్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బెంగళూరుకు చెందిన ‘సే ట్రీస్‌’సంస్థ సభ్యులతో కలసి నగరంలోని 11.6 కిలోమీటర్ల మేర ఉన్న పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేలో హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు బుధవారం అధ్యయనం చేశారు.

దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని హసూర్‌ రోడ్డు ఎలక్ట్రానిక్స్‌ సిటీ ఫ్లైఓవర్‌లోని పిల్లర్లపై పది రకాల మొక్కలతో 3,500 శాంప్లింగ్‌ మొక్కలను వర్టికల్‌ గార్డెన్‌ ద్వారా పెంచుతున్న విధానాన్ని సే ట్రీస్‌ సభ్యులు వివరించారు. ‘‘పిల్లర్ల వర్టికల్‌ గార్డెన్‌లో ఆటోమేటెడ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ ఉంటుంది. రోజుకు 100 మిల్లీలీటర్ల డోస్‌తో నీరు అందుతుంది. వర్టికల్‌ గార్డెన్‌ ఒక్కోవైపు యూనిక్‌ డిజైన్‌ ఉండేలా చూస్తాం. ఈ గార్డెన్‌లతో అన్ని పిల్ల ర్లను కవర్‌ చేస్తున్నాం. దీనివల్ల నగరంలో ఉన్న వేడి తగ్గుముఖం పడుతుంది. పొగమంచుతోపాటు గాలి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. పక్షులు,కీటకాలు ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పరుచుకునే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ విలువ కూడా పెరిగే అవకాశముంది. ఈ గ్రీన్‌వాల్స్‌ వల్ల బయోడైవర్సిటీని నగరంలో పటిష్టం చేసినవారమవుతాం’’ అని సే ట్రీస్‌ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు