‘కృష్ణా’ లెక్కలు సిద్ధం..!

19 Sep, 2016 06:03 IST|Sakshi
‘కృష్ణా’ లెక్కలు సిద్ధం..!

- రెండేళ్లుగా నీటి కేటాయింపుల అన్యాయంపై లెక్కలతో సిద్ధమైన తెలంగాణ
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుది మెరుగులు
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర జల వనరుల శాఖ ఈనెల 21న అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు సన్నద్ధమైంది. కృష్ణా జలాల్లో తెల ంగాణ, ఏపీ రాష్ట్రాలకున్న వాటా, రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు జరిగిన నీటి లెక్కలను సిద్ధం చేసింది. వరుసగా రెండేళ్లపాటు వాటాలకు మించి ఏపీ చేసిన నీటి వినియోగం, ప్రస్తుత ఏడాదిలో పోతిరెడ్డిపాడు కింద చూపిన తప్పుడు లెక్కలపై నివేదికలు రూపొందించింది. ఈ నివేదికకు శనివారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుది మెరుగులు దిద్ది ఖరారు చేసినట్లు తెలిసింది. నివేదికను మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అందజేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.

 కృష్ణా వాటా పెంచాలి..
 బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఏపీ చేపట్టిన పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈలెక్కన తెలంగాణ వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 నుంచి 422 టీఎంసీలకు తగ్గించాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది.

 వాటాలకు మించి వినియోగం
 2014-15లో ఏపీకి 367 టీఎంసీల మేర కేటాయించినా 33 టీఎంసీల మేర అధికంగా విని యోగించింది. నాగార్జునసాగర్ కాల్వల కిందే 24 టీఎంసీల అధిక వినియోగం చేసింది. 2015-16లో తెలంగాణ 75 టీఎంసీలు, ఏపీ 129 టీఎంసీలు వాడుకోగా, నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం చూస్తే ఏపీ 13 టీఎంసీలు అదనంగా వాడుకుంది. ఈ వివరాలను రాష్ట్రం బోర్డు ముందు ఉంచనుంది. గోదావరి బేసిన్‌లో చేపట్టిన కాళేశ్వరం, తమ్మిడిహెట్టి బ్యారేజీ, రాజాపేట, చనాఖా-కొరట, పింపార్డ్, తుపాకులగూడెం, కృష్ణా బేసిన్‌లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తిలపై స్పష్టమైన వివరణ ఇవ్వనుంది. ఇక కల్వకుర్తి కేటాయింపులను 25 నుంచి 45 టీఎంసీలకు పెంచడం సైతం ఉమ్మడి ఏపీలో జరిగే నిర్ణయమని తెలంగాణ చెప్పేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన జీవోలను నివేదికతో జతపరచనుంది.
 
 న్యాయం చేయమని కోరతా: దత్తాత్రేయ

 గోదావరి, కృష్ణా జలాల పంపకాలలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈనెల 21న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుతో దత్తాత్రేయ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని హరీశ్ వివరించారు. నదీ జలాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై నివేదిక అందజేశారు. అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ,  విభజన చట్టంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాలలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి సమావేశం దోహదపడుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం లోపు ఉమా భారతిని కలసి తెలంగాణ పరిస్థితిని వివరించి సత్వర న్యాయం చేయాలని కోరతానన్నారు.

మరిన్ని వార్తలు