6న సభాహక్కుల సంఘం ముందు హాజరుకండి

3 Apr, 2016 03:16 IST|Sakshi
6న సభాహక్కుల సంఘం ముందు హాజరుకండి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాకు అసెంబ్లీ కార్యదర్శి లేఖ
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాహక్కుల సంఘం(ప్రివిలేజెస్ కమిటీ) ముందు హాజరై వాదనలు వినిపించేందుకు ఈ నెల 6న హాజరు కావాల్సిందిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ శనివారం లేఖ రాశారు. కమిటీ భేటీ 6న ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరుగుతుందని తెలిపారు. ‘మీపై  పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును సభాహక్కుల సంఘం పరిశీలిస్తుంది. ఆ నోటీసుపై మీ వాదనలు వినిపించేందుకుగాను కమిటీ ముందు హాజరు కాగలరు’ అని లేఖలో ఆయన కోరారు.

రోజాను గతేడాది డిసెంబర్‌లో జరిగిన శీతాకాల సమావేశాల్లో ఏడాదిపాటు సస్పెండ్ చేయడం విదితమే. ఆ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించేందుకు నియమించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ రోజాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ఆధారంగా సభాహక్కుల సంఘం కూడా రోజాపై సస్పెన్షన్ కొనసాగించాల్సిందేనని నివేదిక ఇచ్చింది. కాగా మార్చి 21న విపక్షం లేకుండా ఏక్షపక్షంగా సాగిన శాసనసభ.. ఆ నివేదిక ఆధారంగా రోజా సస్పెన్షన్‌ను కొనసాగించాలని తీర్మానించింది. సభాహక్కుల సంఘానికి రోజా క్షమాపణలు చెబితే సస్పెన్షన్‌ను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 6న కమిటీ భేటీ కానుంది.

మరిన్ని వార్తలు