చక్కెర చేదు!

1 Aug, 2016 01:37 IST|Sakshi
చక్కెర చేదు!

* కేజీ ధర రూ.42.. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరుగుదల
* సాగు డీలా, కర్మాగారాల మూసివేతే ప్రధాన కారణం
* ఎగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి ధరల నియంత్రణ ఆరంభించిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చక్కెర చేదెక్కుతోంది. గణనీయంగా పడిపోయిన సాగు విస్తీర్ణంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో చక్కెర ధరల్లో 50 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.27.50 పైసలు ఉండగా ప్రస్తుతం అది రూ.42కి పైనే పలుకుతోంది. రాష్ట్రంలో చక్కెర సాగు విస్తీర్ణం వేగంగా పడిపోతుండటం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ ‘నిజాం దక్కన్ సుగర్స్’ మూసివేత వెరసి చక్కెర ఉత్పత్తి, ధరలపై ప్రభావం చూపుతోంది.

రాష్ట్రంలో 2015-16లో ఏడు ప్రైవేటు కర్మాగారాల పరిధిలో 27,76,180 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి కాగా.. ప్రస్తుతం 12,65,238 క్వింటాళ్ల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో ఈ నిల్వలు కేవలం మరో మూడు లేదా నాలుగు నెలలకు సరిపోతాయని లెక్కలు వేస్తున్నారు. డిసెంబర్ వరకు రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి జరిగే పరిస్థితి లేనందున.. మరో ఐదు నెలల పాటు పొరుగు రాష్ట్రాలపై ఆధార పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
 
చక్కెర ఉత్పత్తిపై మూసివేత ప్రభావం..
2015-16లో నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) పరిధిలోని మూడు కర్మాగారాలు మూత పడటంతో చక్కెర ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలు కాగా.. నిజాం సుగర్స్ పరిధిలోనే 20 వేల ఎకరాల మేర ఉండేది. ఎన్‌డీఎస్‌ఎల్ నష్టాలతో ఈ సాగు విస్తీర్ణం గత ఏడాది 7వేల ఎకరాలకు పడిపోయింది.  నిజాం సుగర్స్ మూసివేతతో రాష్ట్రంలో చక్కెర దిగుమతి సుమారు 1,80,000 వేల క్వింటాళ్ల మేర తగ్గిందని అంచనా.

ఈ నేపథ్యంలో చక్కెర ధరలపై ప్రభావం చూపెడుతోంది. ప్రస్తుత ఖరీఫ్ పంట అందుబాటులోకి వ చ్చేందుకు మరో నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు ధరల పెరుగుదల మరింత హెచ్చుగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా.. చక్కెర ఎగుమతులపై 20 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. చక్కెర కొరత తీవ్రమైతే సుంకాన్ని మరింత పెంచడమో లేదా ఎగుమతులను పూర్తిగా నిషేధించడమో జరుగుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సజ్ అండ్ కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి.

కాగా.. గత ఏడాది చక్కెర దిగుమతులపై 40 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని విధించిన కేంద్రం.. ఈ ఏడాది ఎగుమతులపై సుంకం విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ఈ నిల్వలు స్థానిక మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో చక్కెర దిగుమతులపై ఎంట్రీ టాక్స్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ధరల నియంత్రణ కొంత మేర సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు