ప్రధాని నా కాళ్లు విరగ్గొట్టేశారు: కేసీఆర్

15 Mar, 2017 15:11 IST|Sakshi
ప్రధాని నా కాళ్లు విరగ్గొట్టేశారు: కేసీఆర్

పెద్ద నోట్ల రద్దు వల్ల మోటారు వాహనాల పన్నుల రీత్యా కొంత ఆదాయం తగ్గింది తప్ప.. తెలంగాణ రాష్ట్రానికి మరీ పెద్ద ఎక్కువ నష్టం ఏమీ జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్ర కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి తానేనని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. రాష్ట్రంలో తాము మొత్తం 31 జిల్లాలను ఏర్పాటుచేసుకున్నామని, రియల్ ఎస్టేట్ బూమ్ బ్రహ్మాండంగా ఉండి ఆదాయం ఊపందుకుందని, సరిగ్గా ఇలాంటి సమయంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, కొత్త నోట్ల అందుబాటు కూడా తక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయ్యిందన్న విషయాన్ని (ఆప్‌నే మేరే టాంగ్ తోడ్‌ దియే) తాను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించానని కేసీఆర్ చెప్పారు.

అదేంటని ఆయన అడగ్గా, పూర్తి విషయం వివరించానని, గుజరాత్ రాష్ట్రం కంటే కూడా ఎక్కువ వృద్ధిరేటుతో మంచి ఆదాయం సాధించినందుకు తనను ఆయన అభినందించి, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందంటూ ప్రశంసించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విషయంలో పూర్తి విజయం సాధించిందని, ఎక్కడా కోతలన్నవి లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకుని ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. వృత్తినైపుణ్యాలను మరింతగా పెంచుతామని చెప్పారు. టీఎస్ ఐపాస్‌ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తామని, అందుకు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొర్రెలను అందించడమే కాకుండా.. వాటికి ఏమైనా వ్యాధులు వస్తే చికిత్స కోసం 104 తరహాలో ప్రత్యేక వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.

 

మరిన్ని వార్తలు