చావుకు దగ్గర్లో.. విడిచారు

19 Nov, 2015 22:19 IST|Sakshi

కుషాయిగూడ: అనారోగ్యం బారిన పడి చావుకు దగ్గరైన ఓ ఖైదీని జైలు అధికారులు విడుదల చేసిన సంఘటన గురువారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటుచేసుకుంది. జైలు అధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూరి శంకర్ అనే వ్యక్తి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కేసులో నిందితుడు. కేసులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2, 2015న చర్లపల్లి జైలుకు తరలించారు. మద్యం అతిగా తాగడం వల్ల అతని లివర్ చెడిపోయి అనారోగ్యంతో భాదపడుతున్నాడు. కొంతకాలం పాటు జైలులోనే చికిత్స జరిపించిన అధికారులు పరస్థితి విషమించడంతో శంకర్‌ను ఈ నెల 7న గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని రక్తం ఎక్కించాలని సూచించారు. దీంతో చర్లపల్లి జైలు వార్డర్ నాగయ్య ఈ నెల 17న రక్తదానం కూడా చేశారు. అయినా ఎలాంటి ఫలితం లభించలేదు. మానవత్వంతో స్పందించిన జైలు అధికారులు చావుకు దగ్గరైన శంకర్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు అవకాశం కల్పించాలని భావించారు. అందుకు అవసరమైన పత్రాలను జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన మల్కాజిగిరి పదవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ రూ. 20 వేల పూచికత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శంకర్‌ను గురువారం చర్లపల్లి జైలు నుంచి విడుదల చేసినట్లు పర్యవేక్షణాధికారి వెంకటశ్వర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు