ఖైదీలే సైకాలజిస్టులు!

29 Apr, 2017 00:33 IST|Sakshi
ఖైదీలే సైకాలజిస్టులు!

- జైళ్లలోని స్టడీ సెంటర్లలో అందుబాటులోకి ఎంఏ సైకాలజీ
- ఇప్పటివరకు డిగ్రీ కోర్సులకే పరిమితం
- ఇక ముందు పీజీ కోర్సులు కూడా..
- జైళ్ల శాఖ, అంబేడ్కర్‌ వర్సిటీల మధ్య ఒప్పందం
- ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు  


సాక్షి, హైదరాబాద్‌: క్షణికావేశంలో నేరాలు చేసినవారెం దరో జైళ్లలో ఏళ్లకేళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే కొంత మంది ఖైదీలు ఈ సమయాన్ని తమలో పరివర్తన కోసం, ఉన్నత చదువుల కోసం వినియోగించుకుంటున్నారు. అలా చాలా మంది డిగ్రీ పట్టాలు కూడా పొందారు. తాజాగా డిగ్రీయే కాదు పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చేసేలా తోడ్పాటు అందించేందుకు జైళ్ల శాఖ సిద్ధమైంది. ఖైదీల్లో మానసిక అభివృద్ధి, కౌన్సెలింగ్‌ కోసం సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చాలా మంది ఖైదీలు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఆపై అంబేడ్కర్‌ యూనివర్సిటీ సహకారంతో డిగ్రీలు పూర్తిచేస్తున్నారు. కానీ పీజీ చేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తున్నారు.

రెండు కారాగారాల్లో..
ఏటా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని జైళ్లలో 500 మంది వరకు ఖైదీలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. వారిలో సుమారు 150 మంది వరకు ఉత్తీర్ణులవుతున్నారు. ఇలాంటి ఖైదీలు పీజీ కోర్సులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉండడంతో.. వారిని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చర్య లు చేపట్టింది. దీనిపై అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి కేంద్ర కారాగారాల్లో ఉన్న స్టడీ సెంటర్లలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని కోరింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, కడప కేంద్ర కారాగారాలు సైతం ఇదే ప్రతిపాదన చేశాయి.

పీజీ కోర్సుల్లో భాగంగా ఎంఏ సైకాలజీని ప్రవేశపెట్టడం ద్వారా అన్ని జైళ్లలోని ఖైదీలకు మానసిక శిక్షణ, అభివృద్ధికి వారి సేవలు వినియోగించుకో వాలని భావిస్తున్నారు. నేర ప్రవృత్తి కారణంగా జైలుకు వచ్చిన ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నా రు. సీట్ల కేటాయింపుతో సంబంధం లేకుండా పీజీ కోర్సును ప్రవేశపెట్టి ఖైదీలనే.. జైళ్ల శాఖలో సైకాలజిస్టు లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎంఏ సైకాలజీ కోర్సు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉందని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు