ఫిరాయింపులపై ప్రైవేటు బిల్లు

6 Aug, 2016 03:34 IST|Sakshi
ఫిరాయింపులపై ప్రైవేటు బిల్లు

రాజ్యసభలో ప్రవేశపెట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటూ ఆర్టికల్ 361(బి) స్థానంలో కొత్త ఆర్టికల్ చేర్చాలని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని 6వ పేరాను సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఫిరాయింపుల పిటిషన్లపై నిర్దిష్ట కాలపరిమితిలో చైర్మన్ లేదా స్పీకర్ చర్యలు తీసుకొనే విధంగా సవరణ ఉండాలని విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు.
 
కేవీపీ బిల్లుకు సాంకేతిక కారణలు చూపడం సరికాదు
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ప్రవేశపెట్టిన బిల్లుకు సాంకేతిక కారణాలు చూపి అడ్డుకోవడం శోచనీయమని విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా  సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీ, టీడీపీలకు పడుతుందని హెచ్చరించారు. విభజన హామీల అమలులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.

>
మరిన్ని వార్తలు