ప్రయాణికులపై లాఠీ‘చార్జి’!

17 Jun, 2017 00:55 IST|Sakshi
ప్రయాణికులపై లాఠీ‘చార్జి’!
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిలువుదోపిడీ
- ఆర్టీఏ దాడుల నేపథ్యంలో చార్జీలు రెట్టింపు
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ బస్సుల దారి దోపిడీ మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్‌ ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్‌ తదితర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లేకుండా తిరుగుతున్న సుమారు 300 బస్సులను నిలిపేయడం, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో 50కిపైగా ప్రైవేట్‌ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేయడంతో బస్‌ టికెట్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాలకు తగినన్ని సర్వీసులు లేకపోవడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఎడాపెడా చార్జీలు పెంచేశాయి. 
 
అరుణాచల్‌ బస్సులకు బ్రేక్‌..
పర్యాటక రాష్ట్రాలైన అరుణాచల్, నాగాలాండ్, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో జాతీయ పర్మిట్లకు అతి తక్కువ ఫీజులు అమలవుతున్న దృష్ట్యా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు తమ బస్సులను ఆయా రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు 300 వరకు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు మరో 600 వరకూ ఉంటాయి. వీటిలో కొన్ని బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుండగా.. మరికొన్ని బెంగళూరు, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇటీవల అరుణాచల్‌లో ఈ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో వాటిని పట్టుకునేందుకు రవాణా శాఖ కొరడా ఝళిపించింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కడి బస్సులను అక్కడే నిలిపేశారు. మరోవైపు కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా నమోదై స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్న 50 బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఏపీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు నిలిచిపోయాయి.
 
 అదనపు బస్సులు వేయని ఆర్టీసీ
ప్రైవేట్‌ బస్సులపై దాడుల నేపథ్యంలో వంద బస్సులు అదనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆర్టీసీ.. ఏఒక్క రూట్‌లోనూ ఒక్క బస్సునూ వేయలేదు. ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆపరేటర్లు.. బస్సుల కొరతను సాకుగా చూపి చార్జీలను రెట్టింపు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చార్జీలు భారమైనా ప్రైవేట్‌ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తోంది.
 
నిలిచిపోయిన అరుణాచల్‌ సర్వీసులు 300
ఆర్టీఏ సీజ్‌ చేసిన బస్సులు 50

మరిన్ని వార్తలు