ప్రైవేటు బస్సుల జప్తు షురూ

15 Jun, 2017 04:33 IST|Sakshi
ప్రైవేటు బస్సుల జప్తు షురూ
- వేరే రాష్ట్రాల్లో రిజిస్టరై ఇక్కడ స్టేజీ క్యారియర్లుగా రాకపోకలు
చెక్‌పోస్టుల్లో రవాణా శాఖ తనిఖీలు.. 15 బస్సులు సీజ్‌
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
నేటి నుంచి ప్రారంభ పాయింట్ల వద్దనే తనిఖీలు
 
సాక్షి, హైదరాబాద్‌: వేరే రాష్ట్రాల్లో రిజిస్టరై నిబంధనలకు విరుద్ధంగా స్థానికంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను కనిపించినవి కనిపించినట్టుగా రవాణాశాఖ జప్తు చేస్తోంది. మంగళ వారం రాత్రి ఐదు బస్సులను సీజ్‌ చేసిన అధికారులు.. బుధవారం మరో పదింటిని జప్తు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ బస్సులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా వేరే ప్రాంతాల మధ్య స్టేజీ క్యారి యర్లుగా తిరుగుతున్నాయి. మార్నింగ్‌స్టార్, ఆరెంజ్‌ తదితర ప్రైవేటు సంస్థలకు చెందిన ఈ బస్సులను వివిధ చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుని.. అక్కడే సీజ్‌ చేసి ఉంచారు.

‘తనిఖీలు నిరంతరాయంగా సాగుతాయి. వేరే రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ ఉండి, ఆయా ప్రాంతాలతో సంబంధం లేకుండా వేరే ప్రాంతాలకు నడిచే బస్సులు కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధ నలు అతిక్రమిం చినట్టే. అవి ఎక్కడ కనిపించినా సీజ్‌ చేయమని అధికారుల ను ఆదేశించాం. ఇప్పటికే 15 బస్సులు సీజ్‌ చేశాం. వాటిల్లోని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయమని ఆర్టీసీ ఎండీని ఆదేశించాం. ప్రైవే టు బస్సు నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం’ అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం సచివాలయంలో మీడియాకు వెల్లడించారు.
 
మధ్యలో బస్సు జప్తు చేస్తే ఇబ్బందులు..
చెక్‌పోస్టుల వద్ద బస్సులను తనిఖీ చేయాలని మంగళ వారం రాత్రే రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ తనిఖీ చేసి ఐదు బస్సులను సీజ్‌ చేశారు. కానీ అప్పటికప్పుడు దిగిపొమ్మంటే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర య్యాయి. రవాణా శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ తమ బస్సుల్లో ప్రయాణికులను గమ్యస్థానా లకు చేర్చింది. అయితే.. ఆర్టీసీ బస్సులు వచ్చేసరికి జాప్యం కావడం, తాము ఏసీ బస్సుల్లో ఉంటే సాధారణ బస్సుల్లో పంపటం ఏమిటని కొందరు ప్రయాణికులు అధికారులను నిలదీశారు. ఈ నేప థ్యంలో.. ప్రైవేటు బస్సులు ప్రారంభమయ్యే చోటనే తనిఖీ చేసి వాటిని సీజ్‌ చేయాలని రవాణా శాఖ నిర్ణ యించింది. అక్రమంగా తిరిగే ప్రైవేటు బస్సులను స్వాధీనం చేసుకుని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని జేటీసీ రఘునాథ్‌ ‘సాక్షి’తో చెప్పారు.
 
కొరత లేదు: ఆర్టీసీ ఎండీ
రవాణా శాఖ ప్రైవేటు బస్సులను సీజ్‌ చేస్తే వాటి ల్లోని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ రమణారావు పేర్కొన్నారు. ఎన్ని బస్సులు అవసరమైనా పంపుతామని ‘సాక్షి’కి చెప్పారు. మంగళవారం రాత్రి ఐదు బస్సులు పంపామని, ఇప్పటికే వంద బస్సులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు