మా ఫీజులు మా ఇష్టం

26 Mar, 2016 04:11 IST|Sakshi
మా ఫీజులు మా ఇష్టం

- మీరిస్తున్న ట్యూషన్ ఫీజులు మాత్రం పెంచండి
- ప్రభుత్వానికి ప్రైవేటు ఇంటర్మీడియెట్ కాలేజీల డిమాండ్.. స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ
- సర్కారు ఇస్తున్న ఉపకార వేతనాలన్నీ కాలేజీల ఖాతాలోకే..
- రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేల దాకా చెల్లిస్తున్న ప్రభుత్వం
- అయినా వివిధ పేర్లతో రూ.5 వేల నుంచి రూ. 50 వేల దాకా వసూలు చేస్తున్న యాజమాన్యాలు
- ఇంజనీరింగ్ తరహా ఫీజు విధానం ఉండాలంటున్న తల్లిదండ్రులు
- ఫీజుల హేతుబద్ధీకరణకు ఏడుగురితో కమిటీ వేసిన ప్రభుత్వం
 
సాక్షి, హైదరాబాద్:
మేం వసూలు చేసే ఫీజుల మాటెత్తకండి... మాకు ఇస్తున్న ట్యూషన్ ఫీజులను మాత్రం పెంచండి..! రాష్ట్రంలో ప్రైవేటు ఇంటర్మీడియెట్ కాలేజీల డిమాండ్ ఇదీ!! అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ డిపాజిట్, ఇంటర్నల్ పరీక్షల ఫీజు.. తల్లిదండ్రుల నుంచి ఇలా రకరకాల పేరుతో కాలేజీని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు గుంజుతున్న యాజమాన్యాలు ఇప్పుడు.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సు చదివే దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ట్యూషన్ ఫీజును పెంచాలని పట్టుబడుతున్నాయి. ఈ ఫీజును కనీసం రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని బెట్టు చేస్తున్నాయి. ఇందుకు స్పాట్ వాల్యుయేషన్‌ను సైతం బహిష్కరించాయి. దీంతో ప్రభుత్వం ఫీజుల హేతుబద్ధీకరణకు శుక్రవారం ఒక కమిటీ వేసింది. ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజు పెంపుపై ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... యాజమాన్యాల అడ్డగోలు ఫీజులను నియంత్రించాలని, ఇంజనీరింగ్ తరహాలో ఒకే రకమైన ఫీజు విధానం తీసుకురావాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థికి వచ్చేవన్నీ కాలేజీలకే..
ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజులను పెంచాలని యాజమాన్యాలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ విద్యాశాఖ 2006లో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థికి రూ.1,760, సెకండియర్ విద్యార్థికి రూ.1,940 ట్యూషన్ ఫీజుగా చెల్లిస్తోంది. అలాగే విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి రూ.7 వేల స్కాలర్‌షిప్‌ను ఇస్తోంది. అంటే ఒక్కో విద్యార్థికి రెండేళ్లలో రూ. 10 వేలకు పైగా ప్రభుత్వం నుంచే వస్తోంది. సర్కారు ఇస్తున్న ఈ మొత్తాన్ని 90 శాతం కాలేజీలు తమ ఖాతాలోనే వేసుకుంటున్నాయి. అయినా వివిధ పేర్లతో కాలేజీ స్థాయిని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నాయి.

చిక్కుల్లో గ్రామీణ కళాశాలలు..
రాష్ట్రంలో మొత్తం 3,200 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవేటు కాలేజీలే 2,600 వరకు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 650కి పైగా ఉన్నాయి. విద్యార్థుల్లేక, వచ్చే ఫీజులు నిర్వహణకు సరిపోక గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తరహాలో కాలేజీని బట్టి ఒకే రకమైన ఫీజు ఉండాల్సిన అవసరం ఉందని విద్యావేత ్తలు పేర్కొంటున్నారు. గ్రామీణ కాలేజీలకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
కార్పొరేట్ కాలేజీలదీ మరో కథ!
కార్పొరేట్ కాలేజీలదీ మరో తీరు. ఆ కాలేజీల్లో చేరే విద్యార్థులకు యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ట్యూషన్ ఫీజు తీసుకోవు. స్కాలర్‌షిప్‌లు అడగవు కానీ ఇష్టానుసారం వసూళ్లు చేసుకుంటాయి. డే స్కాలర్ అయినా, రెసిడెన్షియల్ అయినా వారు నిర్ణయించిందే ఫీజు! ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నా వాటిపై ఎలాంటి నియంత్రణ లేదు.

ఫీజుల హేతుబద్ధీకరణకు కమిటీ
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. ఇంటర్ విద్యా కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ ప్రతినిధి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల విధానంపై అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు