మే 20న ప్రైవేటు మెడికల్ సెట్

5 Apr, 2016 03:47 IST|Sakshi
మే 20న ప్రైవేటు మెడికల్ సెట్

♦ 35 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష
♦ నేడు టీఎస్ ఎం-సెట్-ఏసీ-2016 నోటిఫికేషన్ విడుదల
♦ నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ   
♦ ఆన్‌లైన్‌లో పరీక్ష
♦ తెలంగాణలో 5, ఏపీలో 4 చోట్ల ప్రాంతీయ పరీక్షా కేంద్రాలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో(ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రథమ సంవత్సరం) 2016-17 విద్యా సంవత్సరంలో 35 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి మే 20న ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎం-సెట్-ఏసీ-2016) నిర్వహించేందుకు తెలంగాణ ప్రైవేటు మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ పరీక్ష తెలంగాణ ఉన్నత విద్యామండలి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీతోపాటు ప్రాంతీయ పరీక్షా కేంద్రాలను సోమవారం అధికారులు ఖరారు చేశారు.

ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నోటిఫికేషన్‌ను ఈ నెల 5(మంగళవారం)న జారీ చేసి, దరఖాస్తులను స్వీరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను (www.tgmedco.com) ఏర్పాటు చేశారు. దరఖాస్తు ఫీజును రూ. 2 వేలుగా నిర్ణయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటేtsmedcet@gmail.com మెయిల్ ఐడీకి పంపించి, తగిన సమాచారం పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షల ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గత ఏడాది ఈ పరీక్షకు 6,600 మంది హాజరు కాగా, ఈసారి 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని కాళోజీ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్-జేఎన్‌టీయూ నేతృత్వంలో రూపొందిస్తారు. ప్రవేశ పరీక్ష, ప్రవేశాల కౌన్సెలింగ్ ఉన్నత విద్యా మండలి, కాళోజీ హెల్త్ వర్సిటీ నేతృత్వంలో జరుగుతాయి.  
 
 ఇదీ షెడ్యూల్...
 ఏప్రిల్ 5: నోటిఫికేషన్ జారీ
 ఏప్రిల్ 5: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
 ఏప్రిల్ 27: దరఖాస్తుల గడువు ముగింపు
 మే 13: హాల్ టికెట్ల డౌన్‌లోడ్
 మే 20: ప్రవేశ పరీక్ష
 మే 21: ప్రశ్నపత్రం, ప్రాథమిక కీ విడుదల
 మే 24 వరకు: అభ్యంతరాల స్వీకరణ
 మే 30: ర్యాంకింగ్, మెరిట్ లిస్టు, ఫైనల్ కీ విడుదల
 అర్హత పరీక్ష మార్కుల అప్‌లోడ్: ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాక.
 ప్రవేశాల కౌన్సెలింగ్: షెడ్యూల్ తరువాత జారీ చేస్తారు.

 ఇవీ ప్రాంతీయ పరీక్షా కేంద్రాలు
► తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్.
► ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు.

మరిన్ని వార్తలు