ఫీ‘జులుం’

20 Apr, 2015 02:07 IST|Sakshi

మాధవరావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. తన కుమార్తెను కార్పొరేట్ స్కూల్‌లో చేర్పించాలని ఆశించాడు. పాప అడ్మిషన్ కోసం ఎల్బీనగర్ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలకు వెళ్లాడు. నర్సరీలో ప్రవేశానికి ఆ పాఠశాల యాజమాన్యం డిమాండ్ చేసిన మొత్తాన్ని విన్న ఆయన గుండె గుభేల్‌మంది. ఒక్క దరఖాస్తు ఫారానికే రూ.1,500 అడిగారు. అడ్మిషన్‌కు రూ.70 వేలు, ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.80 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటితో పాటు యూనిఫాం, పుస్తకాల ఖర్చు ఉండనే ఉంది....ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ల యాజమాన్యాల ఫీజుల దందాకు ఇది ఓ ఉదాహరణ.
 
సాక్షి, సిటీబ్యూరో : నగర ప్రైవేటు పాఠశాలల్లో ఫీ‘జులుం’ అధికమవుతోంది. ఆకాశమే హద్దుగా ఇష్టం వచ్చిన రీతిలో అడ్మిషన్ ఫీజులు, డొనేషన్ల పేరుతో సామాన్యుని హడలగొడుతున్నారు. నగరంలో ఏ ప్రైవేటు పాఠశాల గడప తొక్కాలన్నా చేతిలో రూ.లక్షలు ఉండాల్సిందే. ఫీజుల చెల్లింపులపై ఎటువంటి నియంత్రణ, అజమాయిషీ లేకపోవడంతో మహా నగరంలో ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యంగా మారింది. కాన్సెప్ట్.. ఇంటర్నేషనల్.. మోడల్.. ఇలా పేర్లే మారుతున్నాయి... లక్ష్యం మాత్రం రూ.లక్షలే. కాకపోతే పేరు, వసతులను బట్టి ఫీజు మొత్తంలో స్వల్ప తేడా అంతే. మధ్య తరగతి పిల్లలను ఈ బడుల్లో చేర్పించాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. ఒక్క ఏడాదికే రూ.లక్షలు చెల్లించాలంటే... పాఠశాల విద్య పూర్తయ్యేసరికి ఎన్ని లక్షలు ఖర్చవుతాయో అర్థం చేసుకోవచ్చు.

ఫీజులంటేనే బెంబేలు
మహా నగర పరిధిలో రెండు వేలకు పైగా ప్రైవేట్ ఇంటర్నేషనల్, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 2015-16 విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో దాదాపు 80 శాతానికి పైగా అడ్మిషన్లు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలల్లో జనవరి కంటే ముందే ముగిశాయని సమచారం. 2010 జూలైలో వచ్చిన జీఓ 42 ప్రకారం ఏప్రిల్ 15 నుంచి పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కావాలి. కానీ ఆ తేదీ కంటే ముందుగానే ప్రవేశాలు పూర్తి కావడం గమనార్హం. పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయుల అనుభవం... వారికి చెల్లిస్తున్న జీతభత్యాల ఆధారంగా ఫీజులు నిర్ధారించాల్సి ఉంది.

కానీ మహా నగరంలో ప్రభుత్వ నియమ నిబంధనలు తమకు పట్టవంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఫీజుల పట్టికలను నిర్ణయించేశారు. ఇదిలా ఉంటే ఒక విద్యా సంవత్సరానికి అర్బన్‌లో ఏరియాలో 8 -10 తరగతి విద్యార్థులకు రూ.12 వేలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు రూ. 9 వేల కంటే అదనంగా వసూలు చేయకూడదని వివిధ జీఓల్లో ప్రభుత్వం పేర్కొంది. అంతకు మించి వసూలు చేస్తే.. ఆ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, విద్యా బోధన తదితర అంశాలపై డీఎఫ్‌ఆర్‌సీకి నివేదిక ఇవ్వాలి. డీఎఫ్‌ఆర్‌సీ ఆమోదం తెలిపితే ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచి రాబట్టుకోవచ్చు.

జీఓలో పేర్కొన్న ప్రకారం ఫీజులు తీసుకుంటే తమ మనుగడ ప్రశ్నార్థకమేనని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు భావించాయి. ఆ జీఓను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించగా... 2014 జూన్‌లో కోర్టు స్టే విధించింది. దీంతో ఫీజు చెల్లింపుల విషయంలో నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ఓ మోస్తరు ఆర్థికంగా ఉన్న వారు సైతం ఫీజుల దెబ్బకు విలవిలలాడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

రాజకీయ అండ..
దరఖాస్తు ఫారాల అమ్మకంలోనూ స్కూళ్లు వ్యాపార ధోరణి వీడడం లేదు. వాస్తవంగా విద్యా హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు ఫారాన్ని రూ. 110కి మించి అమ్మకూడదు. కానీ చట్టాన్ని ఉల్లంఘించి రూ.వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ చేష్టలుడిగారు. కొన్ని స్కూళ్లపై చర్యలకు సిద్ధమైనా రాజకీయ నేతలు అడ్డుగా నిలుస్తున్నారు. దాదాపు ప్రతి స్కూల్ యాజమాన్యానికీ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉండడం, పైరవీలు చేయించడం పరిపాటిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారూ ఏమీ చేయలేకపోతున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా