‘ప్రైవేటు’ ఆధ్వర్యంలోనే మెడికల్ కౌన్సెలింగ్

21 Aug, 2016 02:39 IST|Sakshi
‘ప్రైవేటు’ ఆధ్వర్యంలోనే మెడికల్ కౌన్సెలింగ్

- ‘నీట్’ ర్యాంకులతోనే బీ కేటగిరీ, ఎన్నారై సీట్ల భర్తీ
- బీ కేటగిరీకి ఒకే కౌన్సెలింగ్.. ఎన్నారై సీట్లకు కాలేజీల వారీగా..మైనారిటీ సీట్లకు మరో కౌన్సెలింగ్
- మార్గదర్శకాలను ఖరారు చేసిన వైద్యశాఖ
 
 సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీని ఈ ఏడాది కూడా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలోనే చేపట్టనున్నారు. నోటిఫికేషన్ నుంచి కౌన్సెలింగ్ నిర్వహణ, సీట్ల భర్తీ ప్రక్రియ దాకా ఆ సంఘమే నిర్వహించనుంది. బీ కేటగిరీ (35%)తోపాటు ఎన్నారై కోటా (15%) సీట్లన్నింటినీ కూడా ‘నీట్’ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. జాతీయ స్థాయిలో మెడికల్ ప్రవేశాలకోసం చేపట్టిన ‘నీట్’ పరీక్షను ఈసారి యాజమాన్య కోటా (50%) సీట్లకు  నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్-1, నీట్-2 ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో యాజమాన్య కోటాలో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్ల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇక మైనారిటీ కాలేజీల్లోని 25% బీ కేటగిరీ, 15 % ఎన్నారై కోటా సీట్ల భర్తీకీ నీట్ ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. యాజమాన్య కోటా సీట్లకే ‘నీట్’ నిర్వహించినందున రాష్ట్రానికి ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించరు. దేశంలో ఎవరైనా ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇతర రాష్ట్రాల్లోని మేనేజ్‌మెంట సీట్లకు రాష్ట్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు

► ‘నీట్’లో అర్హత సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం నోటిఫికేషన్ జారీచేస్తుంది. సంఘం వెబ్‌సైట్లో నోటిఫికేషన్ వివరాలను పొందుపరుస్తారు
► దరఖాస్తు చేసుకున్న వారి ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా మెరిట్ లిస్టును తయారుచేస్తారు
► తర్వాత కౌన్సెలింగ్ కోసం మరో నోటిఫికేషన్ జారీచేస్తారు
► ఎంపిక కమిటీలో కాళోజీ ఆరోగ్య వర్సిటీ, ఉన్నత విద్యా మండలి, వైద్య ఆరోగ్యశాఖ సభ్యులను ప్రైవేటు యాజమాన్యాల కమిటీనే నియమిస్తుంది
► సీట్ల భర్తీలో రిజర్వేషన్లు ఉండవు. స్థానికత పాటించరు
► ఎంపికైన విద్యార్థులు వర్సిటీ, ట్యూషన్ ఫీజులను చెల్లించాలి
► ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. కస్టోడియన్ సర్టిఫికెట్లను అనుమతించరు
►బీ కేటగిరీ సీట్ల భర్తీకీ అన్ని కాలేజీలకు కలిపి ఒకే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు
► ఎన్నారై కోటా సీట్లకు మాత్రం ఏ కాలేజీకి ఆ కాలేజీయే సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చు
► మైనారిటీ కాలేజీల్లోని సీట్ల భర్తీ మైనారిటీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలోనే వేరుగా నోటిఫికేషన్ ఉంటుంది. పైన పేర్కొన్న నిబంధనలే వీటికీ వర్తిస్తాయి.

మరిన్ని వార్తలు