తత్కాల్ మాయాజాలం

18 Apr, 2016 10:09 IST|Sakshi
తత్కాల్ మాయాజాలం

రాజశేఖర్ ఆదివారం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలి. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో శనివారం తత్కాల్ కోటా కింద టికెట్ కోసం ప్రయత్నించాడు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీలో 22 బెర్తులు ఉన్నట్టు నిర్ధారణైంది.  వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసే సమయానికి బెర్తుల సంఖ్య 4కు పడిపోయింది. వేగంగా ఆన్‌లైన్‌లో టికెట్ చార్జీలు చెల్లించాడు. అయినా అతడికి బెర్తు లభించలేదు. వెయిటింగ్ లిస్టు 17గా నమోదైంది.

వారం రోజుల క్రితం బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రసాద్ అనే మరో ప్రయాణికుడు బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌ఏసీలో టికెట్ కోసం డబ్బు చెల్లించగా రాజశేఖర్ మాదిరిగానే ఇతనికీ వెయింటిగ్ లిస్ట్ వచ్చింది. దిక్కుతోచని పరిస్థితుల్లో యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్‌లో ప్రయత్నించగా బెర్త్ దొరికింది.

తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకునే అవకాశం లేదు. ఒకసారి టికెట్ బుకింగ్ చేసుకుంటే చార్ట్ సిద్ధమయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ట్రైన్ బయలుదేరేందుకు 2 గంటల ముందు బెర్తు నిర్ధారణ అయితే పయనించాలి.  లేదంటే చెల్లించిన చార్జీలపై ఆశలు వదులుకొని మరో ప్రయత్నం చేయాలి. ప్రసాద్ అలాగే థర్డ్ ఏసీ కోసం చెల్లించిన రూ.1000 పైన ఆశలు వదులుకొని మరో ట్రైన్‌లో స్లీపర్ క్లాసులో హైదరాబాద్ చేరుకున్నాడు. ఇది ఒక్క రాజశేఖర్,ప్రసాద్‌లకు ఎదురైన సమస్య కాదు. తత్కాల్ కోటాలో చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య.

 రెండు విధాలుగా నష్టం....
 గతంలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తాము నిరీక్షించేందుకు నిరాకరించదలిస్తే వెంటనే రద్దు చేసుకునే సదుపాయం ఉండేది. దాంతో వారు మరో ప్రత్యమ్నాయం వెదుక్కొనేవాళ్లు. ఇప్పుడు అలా లేదు. తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టులో నమోదు చేసుకుంటే తిరిగి రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. చార్ట్ సిద్ధమయ్యే వరకు ఆగాల్సిందే. అప్పటికి నిర్ధారణ అయితే వెళ్లాలి. చార్ట్ ప్రిపేరైన తరువాత కూడా వెయిటింగ్ జాబితాలోనే ఉంటే మాత్రం ప్రయాణికుడి ఖాతాలోకి టికెట్ డబ్బులు  తిరిగి జమ అవుతాయి. అయితే వెయిటింగ్ జాబితాలో ఉండి రద్దు చేసుకోకుండా మరో రైల్లోనో, బస్సులోనో వెళితే మాత్రం ప్రయాణికులు రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు బెర్తులు కన్‌ఫర్మ్‌లో ఉండి టికెట్ మాత్రం వెయిటింగ్‌లో లభించడం అంతుబట్టకుండా ఉంది.
 
 జూదంలా తత్కాల్...
 ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు అందుబాటులోకి వచ్చే తత్కాల్ సదుపాయం ప్రయాణికుల పాలిట జూదంలా మారింది. ఒక్కో ట్రైన్‌లో 20 నుంచి 40 శాతం వరకు తత్కాల్ కోటా కింద బెర్తులు కేటాయిస్తారు. సాధారణ బుకింగ్‌లో టికెట్ లభించని ప్రయాణికులు, అప్పటికప్పుడు బయలుదేరాలనుకొనే లక్షలాది మంది తత్కాల్‌ను ఆశ్రయిస్తారు. ఐఆర్‌సీటీసీలో తత్కాల్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది క్షణాల్లోనే టికెట్‌లు బుక్ అయిపోతాయి. ఎంతో డిమాండ్ ఉన్న తత్కాల్ కోటా ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తోంది. సాధారణంగా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ‘కన్ఫర్మ్’ అని లేదా ‘వెయిటింగ్’ అనే ఆప్షన్స్ ఆన్‌లైన్‌లో కనిపించాలి.  కానీ ‘కన్ఫర్మ్’(నిర్ధారిత) బెర్తులుగానే ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.  తీరా టికెట్ డబ్బులు చెల్లించిన తర్వాత ప్రయాణికుడికి ‘వెయిటింగ్ టికెట్’ డెలివరీ అవుతుంది. దీంతో  ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. నిర్ధారిత బెర్తులు బుక్ చేసుకుంటే వెయిటింగ్‌లో నమోదు కావడమేమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలా ఒకసారి వెయిటింగ్‌లో నమోదైన తరువాత రైలు బయల్దేరడానికి 2 గంటల ముందు వరకు ఎలాంటి పరిస్థితి తెలియదు.
 

మరిన్ని వార్తలు