బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలి

4 Mar, 2016 03:20 IST|Sakshi
బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలి

ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపితేనే తెలంగాణ రాష్ట్రం శాంతి యుతంగా ఉంటుందని, లేదంటే రాష్ట్రం హింస, ప్రతిహింసల వలయంలో కొట్టుకుపోతుందని ప్రొఫెసర్ హరగోపాల్ గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోయినా ఎన్‌కౌంటర్ల వంటి ఘటనలకు పాల్పడడం దుర్మార్గమైందన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపేందుకు ట్యాంక్‌బండ్‌పై నున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు గురువారం అక్కడికక్కడే అరెస్టు చేశారు.

హరగోపాల్‌తో కలసి తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్, ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు నర్సన్న, పద్మ, తదితరులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు ఛత్తీస్‌ఘడ్ సంఘటనపై  నిరసన తెలిపేందుకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.   అనంతరం  హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో పౌరహక్కుల మహాసభలలో పాల్గొన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ  వస్తే ఎన్‌కౌంటర్లు ఉండవని చెప్పారని గుర్తు చేశారు.

పౌర హక్కులకు  భంగం వాటిల్లకుండా  చూస్తానన్నారనీ, కానీ ఆయన  అధికారం చేపట్టగానే రాష్ట్రంలో పౌర హక్కులను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు జరగలేదని తెలిపారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్లు ఆపితేనే శాంతియుతంగా ఉంటుందని, లేదంటే హింస, ప్రతిహింసల నడుమ నలిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర పోలీసులు ఛత్తీస్‌ఘడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, అసలు ఏం జరిగిందని ఎన్‌కౌంటర్లు చేశారని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు