ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్నుమూత

2 Aug, 2017 01:12 IST|Sakshi
ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్నుమూత
తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలో తుదిశ్వాస
సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఎనలేని సేవలు
భార్గవ మృతికి శాస్త్రవేత్తలు, ప్రముఖుల సంతాపం
రేపు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు


సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పుష్పమిత్ర భార్గవ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వయోభారం, తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొడుకు మోహిత్‌ భార్గవ కెనడాలో ఉంటున్నారు. కూతురు వినీత గుంటూరులో ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. కొడుకు మోహిత్‌ వచ్చిన తర్వాత 3న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భార్గవ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, మాజీ డైరెక్టర్‌లు మోహన్‌రావు, లాల్జీసింగ్, సీనియర్‌ సైంటిస్టులు శివాజీ, జ్యోత్స్న ధావన్, ఇమ్రాన్‌ సిద్ధిఖీ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

జ్యోతిష్య శాస్త్రం కోర్సుపై సుప్రీంకు: ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్‌గా ప్రశంసలం దుకున్న భార్గవ.. సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా 13 ఏళ్ల పాటు విశేష సేవలందిం చారు. 2006లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 220 విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని కోర్సుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినప్పుడు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సైన్స్‌ టెంపర్‌ పెంచేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు. నేషనల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేశారు.

చేప మందుకు వ్యతిరేకంగా..
హైదరాబాద్‌లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు శాస్త్రీయతను సవాల్‌ చేస్తూ 2008 నుంచి జన విజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో భార్గవ పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లారు. చివరకు దాన్ని చేప మందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని కోర్టు పేర్కొంది. చేప మందే కాకుండా హోమియో వైద్యమూ మూఢ నమ్మకమేనని భార్గవ కొట్టిపారేశారు. శాస్త్రవేత్తగా ఆయన కృషికి 1986లో ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. కానీ గతేడాది దేశవ్యాప్తంగా రచయితలు, మేధావి వర్గంపై జరిగిన దాడులు, అసహనానికి వ్యతిరేకంగా అవార్డు తిరిగిచ్చేశారు.

‘హెడిల్‌బర్గర్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరు..
1928 ఫిబ్రవరి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో భార్గవ జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ. వారణాసి బీసెంట్‌ థియోసాఫికల్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన భార్గవ.. లక్నో విశ్వవిద్యాలయం నుంచి 1946లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. 21వ ఏటనే  సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అంశంపై పీహెచ్‌డీ పరి శోధన చేశారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో, అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. 1953 నుంచి 1956 వరకు అమెరికాలోని విస్కాన్సన్‌ వర్సిటీలో పని చేశారు. అక్కడే హెడిల్‌బర్గర్‌ లేబొరేటరీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నిలిచారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ మాజీ అధిపతి, ప్రముఖ శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. విజ్ఞానశాస్త్ర రంగంలో భార్గవ చేసిన సేవలను వైఎస్‌ జగన్‌ కొనియాడుతూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.