చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి

3 Aug, 2015 00:30 IST|Sakshi
చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి

కర్నూలులో నిందితురాలు
పోలీసుల అదుపులో ఆమెకు సహకరించిన వ్యక్తి
కిడ్నాపర్ కోసం పోలీసుల మోహరింపు

 
చిలకలగూడ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అపహరణకు గురైన చిన్నారిని కన్నతల్లి ఒడికి చేర్చేందుకు చిలకలగూడ  పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అపహరించిన వారిని గుర్తించడంలో పురోగతి సాధించారు. ఏ క్షణమైనా నిందితురాలిని  అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు కర్నూలు పట్టణంలో మాటు వేశాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలిపల్లికి చెందిన రేణుక కుమార్తె కావ్య (9 నెలలు)ను శనివారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి విజటర్స్ షెడ్ నుంచి గుర్తుతెలియని మహిళ అపహరించిన సంగతి విదితమే. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం సాయంత్రానికి పురోగతి సాధించారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఘట్‌కేసర్‌కు చెందిన రవికుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా  నిందితురాలు కర్నూలు పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేక నిఘా బృందాలు అక్కడ మోహరించాయి. అదుపులోకి తీసుకున్న రవికుమార్ కూడా మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో నిందితురాలిని పట్టుకోవడంలో కొంతమేర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. కాగా నిందితురాలిని పట్టుకుని చిన్నారిని క్షేమంగా నగరానికి తీసుకువస్తున్నారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని పోలీస్ వర్గాలు కొట్టిపారేశాయి. నిందితురాలిని ఆదివారం సాయంత్రం వరకూ అదుపులోకి తీసుకోలేదని, రాత్రికి, లేదా సోమవారం నాటికి అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌వర్గాలు స్పష్టం చేశాయి.

 అడ్డంకిగా మారిన ఆదివారం...
 చిన్నారిని రక్షించేందుకు ఆదివారం అడ్డంకిగా మారినట్లు తెలిసింది. నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్ కర్నూలు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో సర్వీస్ ప్రొవైడర్ల నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందించలేకపోయారని తెలిసింది. సోమవారం నాటికి నిందితురాలిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 
 

మరిన్ని వార్తలు