ప్రాజెక్టులకు తగ్గిన వరద

3 Oct, 2016 03:47 IST|Sakshi
ప్రాజెక్టులకు తగ్గిన వరద

ఎస్సారెస్పీకి 2 లక్షలు, ఎల్లంపల్లి 1.19లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా నదిలో పూర్తిగా ప్రవాహాలు పడిపోగా, గోదావరిలో మునుపటి కన్నా కాస్త తక్కువగా ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో వచ్చిన కొద్దిపాటి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఆదివారం ఎస్సారెస్పీకి 2 లక్షలు, ఎల్లంపల్లికి 1.19 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చింది. నిజాంసాగర్‌లోకి 85 వేలు, సింగూరులోకి 30 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.

కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 33 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇందులో శ్రీశైలం రిజర్వాయర్‌కు 30 వేల క్యూసెక్కులు చేరుతోండటంతో నిల్వ 202.04 టీఎంసీలకు చేరింది. ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తూ 14,382 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండగా అందులో 6,357 క్యూసెక్కులు సాగర్‌కు చేరుతోంది. దీంతో సాగర్‌లో నీటినిల్వ 171.09 టీఎంసీలకు చేరింది.

మరిన్ని వార్తలు