పట్టణాలపై పిడుగు

4 Apr, 2016 09:46 IST|Sakshi
పట్టణాలపై పిడుగు

- మూడు నుంచి నాలుగు రెట్లు పెరగనున్న ఆస్తి పన్ను!
- జీహెచ్‌ఎంసీ సహా 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 35 మున్సిపాలిటీలు,
- 2 నగర పంచాయతీల్లో పెంపునకు కసరత్తు
- ఏడాది కిందటి ప్రతిపాదనలకు కదలిక
- ప్రభుత్వ ఆమోదమే తరువాయి
- వార్షిక అద్దె విలువల ఆధారంగా పన్ను గణన
- ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్ : పురపాలికలపై పన్ను పిడుగు పడబోతోంది! జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 35 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో త్వరలో ఆస్తి పన్ను పెరగబోతోంది. ప్రస్తుత అద్దెలను పరిగణనలోకి తీసుకుని ఈ పన్నును సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల పెంపు ప్రతిపాదనలు ఏడాదికిపైగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా వీటిపై కదలిక వచ్చింది. ఆస్తిపన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక శాఖ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి.
 
పెంపు ఎప్పట్నుంచి..?
రాష్ట్రంలో మొత్తం 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలు, 25 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 23 కొత్త నగర పంచాయతీలు, 2 కొత్త మున్సిపాలిటీల్లో 2015 ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను పెంపునకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. దీంతో ఆయా చోట్ల ఆస్తి పన్ను మూడు నుంచి ఆరు రెట్లు పెరిగింది.
 
మిగిలిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 35 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో  ఆస్తి పన్ను పెంపుపై ప్రభుత్వం ఏడాది కాలంగా పరిశీలన జరుపుతోంది. గతేడాది జూలైలోనే పెంచేందుకు ప్రయత్నించినా మున్సిపల్ కార్మికుల సమ్మె, ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. త్వరగా నిర్ణయం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఈ పురపాలికల్లో ఆస్తి పన్ను పెంపు అమల్లోకి వచ్చే అవకాశముంది. లేదంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం ఖాయమని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
 పురపాలికల్లో గడ్డు పరిస్థితులు..
 ఒక్క జీహెచ్‌ఎంసీ తప్ప రాష్ట్రంలోని మిగిలిన పురపాలికలన్నీ ఆర్థికంగా గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే కొద్దిపాటి గ్రాంట్లతో వాటి అవసరాలు ఏమాత్రం తీరట్లేదు. ఎన్నో ఏళ్లుగా పెంచకపోవడంతో అరకొర ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా నామమాత్రపు ఆదాయం వస్తోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాయి. నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బిల్లుల బకాయిలు సైతం రూ.150 కోట్లకు చేరాయి.
 
 పట్టణీకరణకు తగ్గ మౌలిక వసతుల కల్పన కూడా సాధ్యం కావడం లేదు. దీంతో ఆస్తి పన్నుల సవరణకు అనుమతించాలని పురపాలక శాఖ ప్రభుత్వాన్ని ఎప్పట్నుంచో కోరుతోంది. శాస్త్రీయ పద్ధతిలో ఆస్తి పన్నుల గణనను ప్రవేశపెడుతూ 1990లో నాటి ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ తర్వాత ఆస్తి పన్నుల తొలి సవరణ 1993 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. రెండో సవరణ 2002 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి 13 ఏళ్లు గడిచినా నివాస గృహాలపై ఆస్తి పన్నుల సవరణ జరగలేదు. 2007 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడో సవరణను నివాసేతర కట్టడాలకే పరిమితం చేశారు.
 
 వడ్డన భారీగానే..
 ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే ఆస్తి పన్నుల సవరణకు పురపాలికలు గెజిట్ ప్రకటన జారీ చేస్తాయి. పురపాలికలను కొన్ని భాగాలుగా విభజించి ఆస్తుల గణన చేపడతారు. ఇళ్లు, భవనాల కొలతలు తీసుకుంటారు. భవన వినియోగ స్వభావం (నివాస/నివాసేతర), ఆ ప్రాంత వార్షిక అద్దె విలువల ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయిస్తారు. ప్రజల నుంచి రెండుసార్లు అభ్యంతరాలు స్వీకరించి తర్వాత పన్ను ఖరారు చేస్తారు. ప్రస్తుతం నివాస భవనాలపై 2002, నివాసేతర భవనాలపై 2007 నాటి వార్షిక అద్దె విలువల ఆధారంగా ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. తాజా వార్షిక అద్దెలను పరిగణనలోకి తీసుకుంటే మూడు, నాలుగు రెట్ల వరకు ఆస్తి పన్నులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
 
ఆస్తి పన్ను పెరిగే పురపాలికలివే..
మున్సిపల్ కార్పొరేషన్లు(6): గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం
 
 మున్సిపాలిటీలు (35): జనగాం, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, ఆదిలాబాద్, భైంసా, బెల్లంపల్లి, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, మందమర్రి, తాండూరు, వికారాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట, జహీరాబాద్, మెదక్, దుబ్బాక, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి నగర పంచాయతీలు(2): సత్తుపల్లి, బాదెపల్లి

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు