మీ అవినీతిని ప్రశ్నిస్తే ప్రసారాలు ఆపేస్తారా?

19 Jun, 2016 01:56 IST|Sakshi
మీ అవినీతిని ప్రశ్నిస్తే ప్రసారాలు ఆపేస్తారా?

సాక్షి, నెట్‌వర్క్: ‘మీ ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను, వైఫల్యాలను ఎత్తిచూపితే మీడియా గొంతు నొక్కుతారా? ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే సహించేది లేదు. ఇకనైనా నియంతృత్వ పోకడలు విడనాడి సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించండి’ అంటూ ప్రజాసంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులు, వివిధ పత్రికల జర్నలిస్టులు సాక్షి మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై మండిపడ్డారు. సాక్షి ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ సంఘాలు, అన్ని పార్టీల నేతలు శనివారం చేపట్టిన ఆందోళనతో విశాఖ జగదాంబ జంక్షన్ దద్దరిల్లింది.కాగా‘సాక్షి’ టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని అనంతపురంలో శనివారం వర్కింగ్ జర్నలిస్టులు రిలేదీక్షలకు దిగారు.

మరిన్ని వార్తలు