ప్రజాసమస్యలపై పోరాటాలు సాగించాలి

28 Aug, 2016 01:28 IST|Sakshi
ప్రజాసమస్యలపై పోరాటాలు సాగించాలి

టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి
* రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా విభాగం పోరాటాలను సాగించాలని తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం మెడలు వంచాలని, గతంలో మహిళా విభాగం చేసిన పోరాటాలు ఫలప్రదం అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతవరకు మహిళలకు ప్రాతినిధ్యమే కల్పించకపోవడం దారుణమన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే కేబినెట్‌లో ఆరుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళా నేతలు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు.

మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ మహిళా విభాగాన్ని బలోపే తం చేసి, సమస్యలపై సమరాన్ని సాగించడానికి సమాయత్తమవుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. కాగా, శాసనసభ్యులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాల చెల్లింపు నిలిపివేయడం సిగ్గుచేటని టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

మరిన్ని వార్తలు