సర్కారుపై దరఖాస్తులతో సమరం

5 Oct, 2016 02:17 IST|Sakshi
సర్కారుపై దరఖాస్తులతో సమరం

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అర్హులైన లబ్ధిదారులతోనే వ్యక్తిగతంగా దరఖాస్తులు చేయించాలని నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగతంగా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ప్రభుత్వానికి అంది స్తామన్నారు. రైతులు, విద్యార్థుల నుంచి దరఖాస్తులను పార్టీ శ్రేణులు సేకరించి ప్రభుత్వానికి అందించడం ద్వారా ఒత్తిడి పెంచుతామన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక కమిటీ, సీనియర్ నాయకులతో గాంధీభవన్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ వివరాలను ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రుణమాఫీ, రీయింబర్స్‌మెంట్‌పై కార్యాచరణ చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఓట్లేయించుకున్న టీఆర్‌ఎస్ ఇప్పుడు మోసం చేస్తోందన్నారు. మూడోవిడత రుణమాఫీ చేయకపోవడంతో 37 లక్షల మంది రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, 3లక్షల మంది మహిళా రైతుల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లోనే ఉన్నాయన్నారు.
 
రూ.720 కోట్లు పక్కదారి..
కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన రూ.720 కోట్లను పక్కదారి పట్టించారని ఉత్తమ్ ఆరోపించారు. రైతుల నోట్లో మట్టి కొట్టేలా నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, ఇటీవల వచ్చిన వరదల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, నష్టంపై నివేదికలను రూపొందిస్తామని చెప్పారు.

13 నుంచి 18 వరకూ రుణమాఫీ, రీయింబర్స్‌మెంట్ అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేస్తుందన్నారు. ఈ దరఖాస్తులను ఈ నెల 21 నుంచి 31 మధ్య తిరిగి సేకరించి, వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు అందిస్తామని చెప్పారు.
 
20న పెద్దపల్లిలో బహిరంగసభ
ఈ నెల 20న పెద్దపల్లి పట్టణంలో రైతుగర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రైతుల సమస్యలను ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ నెల 19న చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్రను నిర్వహిస్తామని, దీనికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్టుగా చెప్పారు.

మరిన్ని వార్తలు