రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో ప్రారంభం

29 Jan, 2017 10:52 IST|Sakshi
రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో ప్రారంభం

హైదరాబాద్:  రాష్ర్టవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. 24,574 కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయసున్న 41,52,210 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం వివిధ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో కూడా 897 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్రస్థాయిలో 55 మంది అధికారులు, జిల్లా స్థాయిలో 120, క్షేత్రస్థాయిలో 2,455 సూపర్‌వైజర్లు, 733 సంచార బృందాలను కార్యక్రమం పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. చిన్నారులందరికీ వ్యాక్సిన్లు వేసేలా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిర్మల్‌ జిల్లా బాసరలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానసరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోని చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేశారు.

అలాగే రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి పలువురు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పల్స్‌ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కరీంనగర్‌ నగరంలోని కార్ఖానగడ్డ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రారంభించి పోలియో చుక్కలు వేశారు.

మరిన్ని వార్తలు