‘పప్పులు’డకవ్.. జాగ్రత్త!

26 Apr, 2015 02:16 IST|Sakshi
‘పప్పులు’డకవ్.. జాగ్రత్త!

సాక్షి, హైదరాబాద్: పప్పు దినుసుల అక్రమ నిల్వలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటోంది. డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం పెంచేం దుకు ప్రైవేటు వ్యాపారులు తెరతీశారన్న సమాచారంతో  ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మూడు రోజుల క్రితం పప్పు ధరలపై అధికారులతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అక్రమ నిల్వలపై దాడులు పెంచాలని పౌరసరఫరాల శాఖ అధికారులను, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
 
 రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో పప్పు ధాన్యాల సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్‌లో మొత్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల సాగు కావాల్సి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. పెసర సాగులో భారీ అంతరం ఉండగా, మినుములు, కందుల సాగు 40 నుంచి 50 శాతం మేరకు తగ్గింది. పెసరపప్పు  1.07 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 24 వేల మెట్రిక్ టన్నులకు పడిపోవడంతో దీని ధర కిలో రూ.115  చేరింది.
 
 ఈ ధరలు గత ఏడాది ధరతో పోలిస్తే రెండింత లు. కందిపప్పు, మినప్పప్పు ధరలు సైతం రూ.80 నుంచి రూ.90 వరకు చేరాయి.  కేంద్ర ప్రభుత్వం 2013 నుంచి  నియంత్రణను  ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్రీయంగా ఉత్పత్తవుతున్న పప్పు ధాన్యాలను మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక లాభాలకు విక్రయిస్తున్నారు.  అదే సమయంలో ఇక్కడ కృతిమ కొరతను సృష్టించి డిమాండ్‌ను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రీయ మార్కెట్‌లో ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ వివిధ జిల్లాల్లో నాలుగైదు కేసులు పెట్టగా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ సైతం మరో పది కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు