భూ సేకరణ, ప్రత్యేక హోదాపై గొంతెత్తితే పీడీ కేసు పెట్టండి

2 Oct, 2016 03:45 IST|Sakshi
భూ సేకరణ, ప్రత్యేక హోదాపై గొంతెత్తితే పీడీ కేసు పెట్టండి

కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: ఎక్కడైతే అన్యాయంపై ప్రజలు గొంతెత్తుతారో.. ఎక్కడైతే న్యాయం కోసం ప్రజలు ఆందోళనల బాట పట్టి తమ హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందో.. అలాంటి ప్రాంతంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విజ్ఞులు చెబుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వ పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మాత్రం.. ప్రజల గొంతు తనకు వినబడకూడదని హు కుం జారీ చేసింది. ఆందోళనలపై ఉక్కుపా దం మోపాలని అధికారులను ఉసిగొల్పింది. గొంతెత్తితే పీడీ కేసులు పెట్టి నొక్కేయాలని ఆదేశించింది. ఆందోళనలు అంటేనే ప్రజలు ఆమడ దూరంలో ఉండేలా చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసేయాలని సూచించింది. సీఎం ఇలా నేరుగా ఆదేశాలివ్వడం ప్రజాస్వా మ్య వాదులను కలవరపెడుతోంది. గూండాగిరి, మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా, భూ కబ్జాదారులు, వ్యభిచారం తదితర అక్రమాలపై ప్రయోగించాల్సిన పీడీ యాక్ట్‌ను.. భూములతో పాటు ఉపాధి కోల్పోయే రైతులు, ఉద్యోగాలు వస్తాయి.. బతుకులు బాగుపడతాయి అని ఆశించి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఐదు కోట్ల ప్రజలపై పెట్టడానికి సీఎం సిద్ధం కావడం ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 ఇవీ సీఎం ఆదేశాలు: కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలో సీఎం చంద్రబాబు తాజాగా సమీక్ష నిర్వహించారు. సదస్సు ముగింపులో శాంతిభద్రతలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి ఆందోళనలు, ధర్నాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేపట్టే భూ సేకరణను ఎవరు వ్యతిరేకించినా.. ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఆందోళన చేసినా.. వారిపై పీడీ కేసులను పెట్టాలని ఆదేశించారు. కేవలం కేసులు పెట్టి వదిలేయకుండా  వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారుల కోసం 50 వేల ఎకరాలను సేకరించాల్సి ఉందని, ఆ సేకరణలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

 విద్యార్థులు వెళ్లకుండా చూడాలి..
 ప్రత్యేక హోదా ఆందోళనల్లోకి విద్యార్థులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు అప్పగించారు. నయానో, భయానో విద్యార్థులను డీల్ చేయాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా సీపీఎం చేపడుతున్న ఆందోళనలను అణిచివేయాలని ఆదేశించారు. ఆందోళనకారులపై ముందస్తుగానే పీడీ యాక్ట్ కేసులను పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ ఫార్మా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆందోళనకారులపైనా పీడీ కేసులను పెట్టాలని సీఎం చెప్పారు. ప్రతీ ఆర్డీవో ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచుతామని, ఆందోళనలను, ధర్నాలను పర్యవేక్షించడానికి వాటిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీలకు సూచించారు.

 ఆందోళన అంటేనే భయపడాలి..
 ఆందోళన కారులపై కేసులు పెట్టి ఊరుకుంటే కుదరదని,  చర్యలను తీసుకుని ఆందోళనలు, ధర్నాలు అంటేనే భయపడేలా చేయాలని సీఎం చెప్పారు.వ్యూహాత్మకంగా వ్యవహరిం చాలన్నారు. కొల్లేరు దగ్గర మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై కూడా ఆందోళన సాగుతోందని కలెక్టర్, ఎస్పీ బాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందిస్తూ చేపల చెరువులను దృష్టిలో ఉంచుకునే రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.ఆందోళనలను ముందుగానే కనిపేట్టేందుకు క్లూస్ టీమ్స్ సరిపడా లేవని, అధికారులు పేర్కొన్నారు. నిఘా వర్గాలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిపైనే కేసులు పెడుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల పక్కనే మద్యం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పలు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
 
 పీడీ యాక్ట్ అంటే..
 శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకున్న సందర్భంలో పీడీ (ప్రివెన్టివ్ డిటెన్షన్) చట్టాన్ని ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్-లెగ్గర్స్ డెకాయిట్స్, డ్రగ్స్ అఫెండ ర్స్, గూండాస్, ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండ ర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ పేరుతో రాష్ట్రంలో పీడీ చట్టం ఉంది. ఈ చట్టాన్ని దారుణ నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారు. ఈ చట్టం ప్రకారం నగరాల్లో అయితే పోలీస్ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు చర్యలు చేపడతారు. నేరాల్లో పాలు పంచుకునేవారిని ఏడా ది వరకూ నిర్బంధించవచ్చు. ఆ తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిందితులను విచారిస్తుంది. కాగా, ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోలేదు. కానీ, పచ్చని పొలాలు కాలుష్య కాసారం చేయవద్దని, పరిశ్రమల కోసమంటూ వేల ఎకరాలు లాక్కొని మా పొట్టకొట్టవద్దంటున్న రైతులు, ప్రత్యేక హోదా మా హక్కు అంటూ నినదిసు ్తన్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చట్టం ప్రయోగించాలనుకోవడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు