జైల్లో ఖైదీలకంటే హీనమా?: ఆర్‌.కృష్ణయ్య

3 Mar, 2017 20:50 IST|Sakshi
జైల్లో ఖైదీలకంటే హీనమా?: ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: జైల్లో ఖైదీలకు నెలకు 3 వేల రూపాయలు భోజనం కోసం మంజూరు చేస్తుండగా, మెడిసిన్‌, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు 1050 రూపాయలు మెస్‌ఛార్జీలుగా ఇస్తున్నారు. జైల్లో ఖైదీలకిచ్చే ప్రాధాన్యత విధ్యార్థులకు ఇవ్వరా?.. ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు రోజుకు రూ.35 వంతున పూటకు 10.67 రూపాయలతో భోజనం సాధ్యమేనా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విధ్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

స్కాలర్‌షిప్‌లు, మెస్‌ఛార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హాస్టల్‌ విద్యార్థులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కానుకగా ఉద్యోగ, కార్మిక వర్గాలకు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్‌ఛార్జీలు పెంచక పోవడం శోచనీయమన్నారు. బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, రాంకోటి, కుల్కచర్ల శ్రీనివాస్‌, రామలింగం, నర్సింహ్మగౌడ్‌, వేముల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు