రిటైర్‌ అయినా కొనసాగిస్తారా..!

24 Jun, 2017 01:47 IST|Sakshi
రిటైర్‌ అయినా కొనసాగిస్తారా..!

సీఎం కేసీఆర్‌కు ఆర్‌.కృష్ణయ్య లేఖ
సాక్షి, హైదరాబాద్‌: కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిటైర్‌ అయిన వారిని ఇంకా కొనసాగించడం ఏంటని ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నించారు. పది జిల్లాలకే సరిపోని ఉద్యోగులు, కొత్తగా నియామకాలు చేపట్టకుండా 31 జిల్లాలను ఎలా పరిపాలిస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల వరకు ఖాళీలున్నాయి. ఉద్యోగులు లేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

రిటైర్‌ అయిన వారిని ఓఎస్డీలు, ప్రభుత్వ సలహాదారులుగా దాదాపు 2 వేల మందిని నియమించుకున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లేక రోడ్ల మీద తిరుగుతున్నారని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన వారిని కొనసాగిస్తే బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ బలహీనపడుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయకపోతే పరిపాలన అస్తవ్యస్తమై రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని, రిటైర్‌ అయిన వారిని వెంటనే తొలగించి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు