వెంట ఉన్నా తంటాలే!

7 Mar, 2017 03:23 IST|Sakshi
వెంట ఉన్నా తంటాలే!

మందుబాబుల కారులో ‘మద్యం తాగిన స్థితి’లో వెళ్లినా కేసే
‘మద్యం కేసుల’పై రాచకొండ పోలీసుల దృష్టి


సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగి ఉన్న స్థితిలో.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నడుపుతున్న వాహనంలో ప్రయాణిస్తున్నారా..? అయితే మీపైన కూడా ఇకపై కేసు తప్పదు. ప్రస్తుతం ఎదుటి వారి మరణానికి కారణమైన కేసులకు మాత్రమే ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన రాచకొండ పోలీసులు.. భవిష్యత్తులో మిగిలిన కేసులకూ అమలు చేయాలని యోచిస్తున్నారు. మద్యం తాగిన స్థితిలో, మైనర్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వాళ్లు చేసిన ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ మహేష్‌ ఎం. భగవత్‌ నిర్ణయించారు. వీరిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 304 పార్ట్‌ 2 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయనున్నామని ఆయన వెల్లడించారు.

నేరం నిరూపితమైతే వీరికీ శిక్ష తప్పదు..
మద్యం మత్తులో ప్రమాదానికి కారణమై, ఎదుటి వారి ప్రాణం తీసిన వాహనం డ్రైవర్‌తో పాటు అతడి వెంట ఉన్న వారినీ నిందితులుగా చేర్చాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. మద్యం మత్తులో.. అదే స్థితిలో ఉన్న వ్యక్తిని డ్రైవింగ్‌ చేయడానికి అనుమతించడం అంటే ప్రమాదానికి ప్రేరేపించడం అనే అర్థం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీసీలోని 109 సెక్షన్‌ కింద వీరినీ నిందితులుగా చేర్చనున్నామని వివరిస్తున్నారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైతే వీరికీ శిక్ష తప్పదు.

తెలిసీ తప్పు చేసినట్లే..
సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఐపీసీలోని 304(ఏ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తుంటారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారనేది ప్రధాన అభియోగం అవుతుంది. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో ఉంటే మాత్రం ఆ కేసును 304 పార్ట్‌ 2 సెక్షన్‌గా నమోదు చేయనున్నారు. దీని ప్రకారం కేసు నమోదు చేస్తే ఎదుటి వారి మరణానికి కారణమవుతుందని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ప్రధాన అభియోగం అవుతుంది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం ఎదుటి వారికి ప్రమాద హేతువని తెలిసీ ఆ స్థితిలో వాహనం నడిపినందుకు ఇలా కేసు నమోదు చేయనున్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ పొందడం చాలా కష్టం. మరోవైపు ఈ కేసులో నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.