బాబు, వెంకయ్యలకు రఘువీరా లేఖ

15 Jul, 2016 19:02 IST|Sakshi

హైదరాబాద్ : ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీసీ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపాదించి.. ఆమోదించేందుకు సహకరించవలసిందిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం వారిద్దరికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖను హైదరాబాద్లోని ఇందిరాభవన్లో రఘువీరా విడుదల చేశారు.

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు... బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా సదరు లేఖలో వారికి రఘువీరా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటీవల లోక్సభలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన లేఖలో పొందుపరిచారు.

అంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతుంది. అయినా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంపై రఘువీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పీసీసీ చీఫ్ రఘువీరా అటు చంద్రబాబుకు .. ఇటు వెంకయ్యనాయుడుకు ప్రత్యేక హోదాకు సహకరించాలని లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పీసీసీ చేస్తున్న పోరాటాన్ని రఘువీరా సోదాహరణగా వివరించారు. బీజేపీ అగ్రనాయకుడిగా మీ పార్టీ ముఖ్యమంత్రుల మద్దతు కోసం కృషి చేయాలని వెంకయ్యను రఘువీరా కోరారు. శనివారం (16-06-2016) న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ అధ్యక్షతన నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

మరిన్ని వార్తలు