ఫలక్‌నుమాలో పట్టాలు తప్పిన రైలింజన్

20 Sep, 2015 00:55 IST|Sakshi
ఫలక్‌నుమాలో పట్టాలు తప్పిన రైలింజన్

- ఆలస్యంగా నడిచిన ప్యాసింజర్ రైళ్లు
- మధ్యాహ్నం వరకు ఎంఎంటీఎస్ సర్వీసుల నిలిపివేత
చాంద్రాయణగుట్ట:
ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున రైలింజన్ పట్టాలు తప్పింది. దీనిని గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్‌ఎం) రాజ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 11367 నంబర్ కలిగిన రైలింజన్ గూడ్స్ రైలు బోగీలను తీసుకువచ్చి ప్యాసింజర్ రైలు బోగిలను తగిలించుకునేక్రమంలో చక్రాలు పట్టాలు తప్పింది.దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజన్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్, కాచిగూడ నుంచి వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అనంతరం కాచిగూడ నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను రప్పించి రైలింజన్‌ను పట్టాల పైకి ఎక్కించారు. ఈ కారణంగా దాదాపు మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
 
ఎంఎంటీఎస్ సర్వీసుల నిలిపివేత
రైలింజన్ పట్టాలు తప్పడంతో అధికారులు ఫలక్‌నుమా-సికింద్రాబాద్ రూట్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్యాసింజర్ రైళ్ల రద్దీ తగ్గడంతో సర్వీసులను పునరుద్దరించారు.
 
వర్షంతో ఒరిగిన సిగ్నల్ స్తంభం
శుక్రవారం రాత్రి పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి ఫలక్‌నుమా బ్రిడ్జి సమీపంలోని సిగ్నల్ లైట్ ఒకవైపు ఒరిగింది. రైలింజన్‌ను రివర్స్‌లో తీసుకొస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా ఇంజన్ పట్టాలు తప్పినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్‌ఎం) రాజ్ కుమార్ సాక్షికి తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు.

మరిన్ని వార్తలు