రూటే.. సెపరేటు..

14 Jul, 2016 23:54 IST|Sakshi
రూటే.. సెపరేటు..

సిటీబస్సుల తీరు ఇష్టారాజ్యం
బస్‌బేలను కాదని రోడ్డుపైనే నిలిపేస్తున్న వైనం
అమలుకు నోచని క్యూ రెయిలింగ్

 
సిటీబ్యూరో: నగర ప్రజల ప్రయాణానికి అనువుగా వేలాది సిటీబస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఎప్పుడు కదులుతుందో తెలియదు. ఒకదాని వెనుక ఒకటి ఒకేసారి నాలుగైదు వస్తాయి.. రోడ్డు మధ్యలోనే ఆగుతాయి.. వెనుక వచ్చే వేలాది వాహనాలకు బ్రేకులు వేస్తాయి. నగరంలో ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఒక్కరికీ అనుభవమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నడుస్తున్న సిటీ బస్సుల కారణంగా నగరంలో ట్రాఫిక్ భయానకంగా మారింది. బస్టాపులను, బస్‌బేలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా నడిరోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఆర్టీసీ డ్రైవర్లకు అలవాటుగా మారింది. కొన్ని బస్సుల రాకపోకలు, అడ్డగోలు డ్రైవింగ్ కారణంగా నిత్యం లక్షలాది వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ ఘోరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ సిటీ బస్సుల విచక్షణా రహితమైన డ్రైవింగ్ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. సిటీలో 1913 బస్టాపులు, 134 బస్‌బేలు ఉన్నాయి. వీటిలో బస్సులు ఆగకపోవడంతో ఆటోలకు, ప్రైవేటు వాహనాలకు అడ్డాలుగా మారాయి.  
 
గుంత.. వదలని చింత..
నిత్యం వందలాది వాహనాలు రద్దీగా తిరిగే రోడ్డు.. గురువారం ఉదయం ఎప్పటిలాగే సాగిపోతున్నాయి. రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో ఓ కారు పడిపోయింది. పదిమంది కలిసి బయటకు లాగేందుకు ప్రయత్నించారు.. వీలుకాలేదు.. వెనుక నుంచి మరో పదిమంది నెట్టారు.. కదలిక వచ్చింది. ఇదంతా జరగడానికి అరగంట సమయం పట్టింది. ఇంతలో మరో కారు.. ఇలా వరుసగా పడిపోతున్నాయి. వెనుకా ముందూ.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. యూసుఫ్‌గూడ పరిధిలోని ఆర్‌బీఐ క్వార్టర్స్ వద్ద పరిస్థితి ఇది. ఇక్కడ గతంలో కేబుల్ నిర్మాణం కోసం గతంలో రోడ్డును తవ్వి వదిలేశారు. మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడి పరిస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇది జరిగి నెలరోజులు గడిచింది. బుధవారం రాత్రి మట్టి తెచ్చి రోడ్డు మధ్యలో పోసి వదిలేశారు. గురువారం ఉదయం ఓ పక్క మట్టి కుప్పలు.. మరోపక్క గుంతలో వాహనాలు ఎటూ పోలేని పరిస్థితి. వచ్చిన ప్రతి కారూ రోడ్డు మధ్యలోని గుంతలో పడిపోవడం పరిపాటిగా మారింది. స్థానికులే ఆ కార్లను బయటకు లాగి పంపించారు. పైగా అది మూడు రోడ్ల జంక్షన్ కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో వాహనదారులు నరకం చూశారు. స్థానికంగా టైర్లకు పంక్చర్లు వేసే ప్రకాష్ మట్టితో గుంతలు కప్పడంతో వాహనదారులకు ఊరట లభించింది. - జూబ్లీహిల్స్
 
యమపాశాలు..
 శ్రీనగర్‌కాలనీ ప్రధాన రోడ్డుకు ఓ వైపు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అదే మార్గంలో స్తంభాలకు కట్టిన కేబుళ్లను తొలగించి దారిపొడవునా పడేశారు. దీంతో ఆ దారిలో వెళుతున్న వాహనాలకు ఈ తీగలు చిక్కుకుని పడిపోతున్నారు. ఈ కేబుళ్లను దాటుకుని వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు హడలిపోతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
 
 ఔరా.. ప్రతిభ..!
 పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి వ్యర్థాలకు అర్థం చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు, జానకి దంపతుల కుమార్తెలు అనూష, అశ్విని దూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకరు 10, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. రాజు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. కాగా అనూష, అశ్విని చదువుల్లో రాణిస్తూ వెస్టేజీతో జుమ్కీలు, చెవి కమ్మలు తయారు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. కాగితం, అట్ట ముక్కలు, కలర్ పేపర్లు, గమ్, పూలు, గాజు పెంకులతో రంగు రంగుల చెవి కమ్మలు, చెవి హ్యాంగింగ్స్‌ను నిమిషాల్లో తయారు చేసి చూపిస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు తయారు చేసిన వస్తువులు చూపరులను ఆకట్టుకోవడమే కాదు.. వాటిని ధరించి ఆనందిస్తున్నారు కూడా. - సుభాష్‌నగర్
 
 
అటకెక్కిన ‘క్యూ రెయిలింగ్’..
ముంబయి తరహాలో సిటీ బస్సుల రాకపోకలపై నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ‘క్యూ రెయిలింగ్’ ఏర్పాటు కోసం చేసిన అధ్యయనం అటకెక్కింది. కూకట్‌పల్లి, ఈఎస్‌ఐ, కేపీహెచ్‌బీ, ఎన్‌ఎండీసీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, నానల్‌నగర్, బాపూనగర్, లక్డీకాపూల్, నాంపల్లి, గృహకల్ప, లోతుకుంట, బోయిన్‌పల్లి, తదితర చోట్ల బస్‌బేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
 
గద్దర్‌కు పురస్కారం
ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డిలకు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ‘సినారె విశిష్ట పురస్కారాన్ని’ ప్రదానం చేశారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సినారె జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో ఈ వేడుక నిర్వహించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ పి.విజయబాబు అధ్యక్షతన సభలో గద్దర్ మాట్లాడుతూ అవార్డులు బాధ్యతను  పెంచుతాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, అలనాటి నటి జమున రమణారావు,
 వ్యాఖ్యాత మోహన్ కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో
 
 

మరిన్ని వార్తలు