జూలై 11 నుంచి రైల్వే నిరవధిక సమ్మె నోటీసు

27 Jun, 2016 04:20 IST|Sakshi

రైల్ నిలయం వద్ద నేడు బహిరంగ సభ
హైదరాబాద్: ఏడో వేతన సంఘం సిఫార్సులు రైల్వే కార్మికులకు తీవ్ర నిరాశను కలిగించాయని..ఈ సిఫార్సులకు నిరసనగా జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు రైల్వే సంఘాలు పిలుపునిచ్చినట్లు రైల్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్ మాల్గి తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మజ్దూర్ యూనియన్ సభ్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తూ రైల్వేలోని రెండు గుర్తింపు సంఘాలు నోటీసులు జారీచేశాయన్నారు. రైల్వే ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సాధించుకొనేందుకు ఈ సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. సమ్మె విజయవంతం చేయడానికి సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నట్లు  తెలిపారు. ఈ సభను  విజయవంతం చేయాలని అన్ని సంఘాల నాయకులను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గీరం రాంప్రభు, హరిబాబు, పి. మోహన్, ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు