సమ్మె సైరన్ మోగిస్తాం

12 Jun, 2016 19:21 IST|Sakshi

- నిరవధిక సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు : శివగోపాల్ మిశ్రా
- సమ్మె తేదీలోపు ప్రభుత్వం స్పందించాలి
- కార్మికులు సమ్మెకు దిగితే భారీ నష్టాలు వాటిల్లుతాయి
- సమ్మె పోస్టర్ ఆవిష్కరణ


హైదరాబాద్‌ : ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జులై 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నామని ఎన్‌జేసీఏ కన్వీనర్, ఏఐఆర్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదివరకు కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక తీరుకు నిరసనగా 1968, 1974లో రైల్వేతో పాటు అన్ని శాఖల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము చేపట్టనున్న సమ్మెలో 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వ్యతిరేకతకు నిరసనగా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లు ఏడవ వేతన సిఫార్సులో సవరణలు, కనీస వేతనం 18వేల నుంచి 26 వేల రూపాయలు ఇవ్వాలని, కొత్త పెన్షన్ విధానం వద్దని, వీటన్నింటిని వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా వారు స్పందించడం లేదని ఆరోపించారు.

ఎస్సీఆర్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి సీహెచ్. శకర్‌రావు మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కార్ కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి పేద ప్రజలకు, కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంటే మన దగ్గర మాత్రం మోదీ సర్కార్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజానీకం నడ్డి విరుస్తుందని ఎద్దేవా చేశారు. రైల్వేలో, డిఫెన్స్‌లో ఎఫ్‌డీఐను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

7 రోజులు రైల్వే సమ్మె జరిగితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడతాయి, 10 రోజుల రైల్వే వ్యవస్థ సమ్మెతో పరిశ్రమలు మూత పడతాయి,15 రోజులు సమ్మె చేస్తే దేశం స్తంభించిపోతుందని తెలిపారు. అందువల్ల సమ్మె జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిస్తే బాగుంటుందని హెచ్చరించారు. తొలుత సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శివగోపాల్ మిశ్రా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పలు విభాగాల ఉద్యోగులు, మజ్దూర్ యూనియన్ నాయకులు సత్యనారాయణ, అరుణ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు