రైల్వే టికెట్ కౌంటర్లకు చెల్లు!

24 Jul, 2016 03:40 IST|Sakshi
రైల్వే టికెట్ కౌంటర్లకు చెల్లు!

-     దశలవారీగా 2020కల్లా పూర్తిగా ఎత్తివేత
-     ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు
-     ఆ సిబ్బందికి వేరే పనుల పురమాయింపు
-     ఇప్పటికే కొందరిని సరెండర్ చేసిన అధికారులు

 
 సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది ఉద్యోగులతో ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేలలో ఒకటైన భారతీయ రైల్వే... సిబ్బంది జీతాల ఖర్చును వీలైనంత తగ్గించుకోవాలని నిర్ణయించింది. సంస్థను సంస్కరణల బాటపట్టించి లాభాలు పెంచుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లను దశలవారీగా 2020కల్లా మూసేయాలని నిర్ణయించింది.
 
 కేవలం జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేసే సాధారణ కౌంటర్లను మాత్రమే పరిమితంగా ఉంచి మిగతా టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో విక్రయించే ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వేషన్ టికెట్ల కోసం వీలైనన్ని ప్రైవేటు బుకింగ్ కేంద్రాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా 40 మంది టికెట్ జారీ సిబ్బందిని సంబంధిత విభాగం సరెండర్ చేసింది. వారికి వేరే పనులను పురమాయించారు.
 
 టీసీలదీ అదేబాట
 దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 3,500 మంది టికెట్ చెకింగ్ (టీసీలు) అధికారులున్నారు. వారి సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించాలని రైల్వే నిర్ణయించింది. గతంలో ప్రతి బోగీకి ఒక టీసీ అవసరం ఉండేది. ప్రస్తుతం ప్రతి బోగీ నుంచి మరో బోగీలోకి వెళ్లేందుకు వీలుగా ప్రవేశ మార్గం ఉంటోంది. దీంతో ప్రతి 3 బోగీలకు ఒక టీసీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా కుదించి రైలు మొత్తానికి ముగ్గురు, నలుగురు టీసీలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో వారి సంఖ్య తగ్గనుంది. ఇదే కాకుండా ఇతర విభాగాల్లోనూ సిబ్బంది సంఖ్యను భారీగా కుదించనున్నారు. రిటైరైన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలను నిలిపేయడంతోపాటు ఆయా విభాగాల్లో మిగతా వారిని వేరే విభాగాలకు పంపనున్నారు.

మరిన్ని వార్తలు