లోటు వర్షం...అడుగంటుతున్న జలం

10 Sep, 2016 01:21 IST|Sakshi
లోటు వర్షం...అడుగంటుతున్న జలం

వర్షపాతంలో 6 శాతం లోటు

 సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్ల కంటే రాష్ట్రంలో వర్షాలు కాస్త ఆశాజనకంగా ఉన్నా... సాధారణ వర్షపాతంతో పోలిస్తే 6 శాతం లోటు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 548 మిల్లీ మీటర్లు వర్షపాతం (సాధారణం 585 మి.మీ.) నమోదైంది. 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కనిపించినా... మెదక్ జిల్లాలో అత్యల్పంగా 25 శాతం లోటు రికార్డయింది. రాష్ట్రంలోని వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిపై భూగర్భ జల విభాగం శుక్రవారం నివేదిక విడుదల చేసింది. ఆగస్టులో కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనా... అది యథాతథంగా కొనసాగకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయని నివేదిక వివరించింది.

గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు భారీగా క్షీణించాయని, అది పూడుకోవాలంటే సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుందని పేర్కొంది. నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఆగస్టులో సగటు భూగర్భ మట్టం 12.47 మీటర్లు కాగా ప్రస్తుతం 12.32 మీటర్లుగా ఉంది. కొంతలో కొంత మెరుగ్గా ఆగస్టులో కురిసిన వర్షాలకు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భూగర్భ మట్టాల్లో స్వల్పపెరుగుదల కనిపించింది.

>
మరిన్ని వార్తలు