విపత్తు వేళ...భరోసా!

19 May, 2016 23:48 IST|Sakshi
విపత్తు వేళ...భరోసా!

వర్ష విపత్తులు ఎదుర్కొనేందుకు అధికారుల కసరత్తు
మంత్రి కేటీఆర్ చొరవతో ఎమర్జెన్సీ కంట్రోల్ రూం
అన్ని ముఖ్య శాఖలతో సమన్వయం
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా ఏర్పాట్లు

 

వర్షాకాలం వస్తుందంటేనే నగరవాసుల్లో దడ. చినుకు పడితే నరకమే. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడం, నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, రోడ్లు నదులను తలపించడం మామూలే. వీటికి తోడు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు. రోజుల తరబడి విద్యుత్ సమస్యలు కూడా. వీటికి చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ‘ఎమర్జెన్సీ కంట్రోల్ రూం’ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఫోన్ నెంబర్లను గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వ ముఖ్య శాఖలను సమన్వయపరిచేలా రూపొందించారు. వర్షం కారణంగా నగరం నలుమూలలా ఎక్కడ..ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగేలా చర్యలు చేపడుతున్నారు.    - సాక్షి, సిటీబ్యూరో

 

సిటీబ్యూరో: వర్షాకాల విపత్తుల్ని ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. గురువారం మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు దీన్ని ప్రారంభించారు. ప్రజలనుంచి అందే ఫిర్యాదుల్ని ఈ కంట్రోల్ రూమ్‌లో ఉండే వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పరిష్కరిస్తారు. వర్షం సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు ఈ ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలోని నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంట్రోల్ రూం ఇలా పనిచేస్తుంది...

     
వర్షాకాలంలో భారీ వర్షసూచనల వంటివి వాతావరణ శాఖ నుంచి తెలియగానే వివిధ విభాగాలనుంచి ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌లో అందుబాటులో ఉంటారు.  {పజలు తమ సమస్యలను విపత్తు సమయంలో 100 నెంబర్‌కు లేదా 040-21 11 11 11 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఆ నెంబర్ల నుంచి ఫిర్యాదు ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు చేరుతుంది.ఫిర్యాదు అందగానే.. తమ వద్ద ఉన్న రిసోర్స్ మ్యాపింగ్ ద్వారా సమీపంలోని ఎమర్జెన్సీ బృందాలు.. వారి వద్ద ఉన్న ఉపకరణాలు తదితరమైనవి కంట్రోల్ రూమ్‌లోని అధికారులు తెలుసుకుంటారు.

     
ఫిర్యాదు పరిష్కారానికి ఎవరు ఏంచేయా లో.. సంబంధిత విభాగం అధికారి క్షేత్రస్థాయిలోని తమ వారికి ఆదేశాలిస్తారు. వారు వెంటనే రంగంలోకిదిగి చర్యలు చేపడతారు.రోడ్లపై నీరు నిలిచిపోతే నీటిని తోడే మోటర్లను పంపుతారు. చెట్లు  కూలితే వాటిని తొలగించేందుకు అవసరమైన ఉపకరణాలతో కూడిన బృందాలను పంపుతారు. ఇలా.. ఏ విభాగం నుంచి ఏమేం అవసరమో, ఎవరివద్ద ఏమేం ఉన్నాయో గుర్తించి త్వరితంగా చర్యలు చేపడతారు. అనంతరం సమస్య పరిష్కారమైందీ లేనిదీ కంట్రోల్ రూమ్ నుంచి తెలుసుకుంటారు. ఏవైనా ఆటంకాలు ఎదురైతే అవసరమైన అదనపు సిబ్బంది, సామాగ్రి పంపించే ఏర్పాట్లు చేస్తారు.

     
దీంతోపాటు త్వరలోనే ఎన్‌ఆర్‌ఎస్‌సీ, జీహెచ్‌ఎంసీ కలిసి సంయుక్తంగా మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తేనున్నాయి. సమస్యను ఫొటో తీసి( చెట్లు కూలినా, నీళ్లు రోడ్లను ముంచెత్తినా.. శిథిల భవనాలు కూలినా.. ఇతరత్రా) సదరు ఫొటోను సెల్‌ఫోన్‌లో తీసి యాప్‌కు అప్‌లోడ్ చేస్తే కంట్రోల్‌రూమ్‌లోని వారికి అది  ఏప్రాంతం నుంచి వచ్చింది.. ఫోన్ చేసినవారి నెంబర్.. సదరు సమస్య పరిష్కారానికి సమీపంలో ఉన్న సిబ్బంది, యంత్రాలు.. తదితరమైవన్నీ తెలుస్తాయి. జియోట్యాగింగ్‌తో వీటిని తెలుసుకొని వెంటనే రెస్క్యూ ఆపరేషన్        నిర్వహిస్తారు.

     
వాతావరణ శాఖ నుంచి ముందస్తుగా అందే హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. 100 నెంబర్, 040-21 11 11 11 యధావిధి సేవలు అందిస్తాయని, విపత్తుల సమయంలో మాత్రం సహాయకచర్యలకు, సమస్యలపరిష్కారానికి  ప్రజలు విచక్షణతో ఫోన్ చేయాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెంబర్లు కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానమై పనిచేస్తాయి. అందిన ఫిర్యాదులను  త్వరితంగా పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి 105 మాన్సూన్ ప్రత్యేకబృందాలు పనిచేస్తాయి. వివిధ షిప్టుల్లో ఇవి పనిచేస్తాయి. వీటి తోపాటు జలమండలికి చెందిన 29 ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తాయి.

 

100కు  ఫిర్యాదు చేసిన మంత్రి
ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను ప్రారంభించిన అనంతరం...కొత్త వ్యవస్థ పనితీరు పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ 100 నెంబర్‌కు ఫోన్‌చేశారు. తాను కవాడిగూడ నుంచి మాట్లాడుతున్నానని, ఇక్కడ చెట్టు కూలిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీకి విషయం తెలియజేసి పరిష్కరిస్తామని అవతలి నుంచి సమాధానం రావడంతో మంత్రి సంతృప్తి చెందారు. చివరగా, తాను కేటీఆర్‌ను మాట్లాడుతున్నానని అసలు విషయం వివరించారు.

>
మరిన్ని వార్తలు