హోదాపై రాజ్యసభలో గందరగోళం

26 Jul, 2016 16:43 IST|Sakshi
హోదాపై రాజ్యసభలో గందరగోళం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై మంగళవారం రాజ్యసభలో మరోసారి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై సభలో చర్చించి ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలు మిన్నంటాయి.
 
 ప్రత్యేక హోదా కల్పించడం ఏపీకి అంత్యంత ముఖ్యమైన అంశమైనందున దానిపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చర్చకు అనుమతించలేదు. సీపీఎం పక్ష నేత ఏచూరి సీతారాం జోక్యం చేసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
 కాంగ్రెస్ సభ్యుడు గత శుక్రవారం సభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై మంగళవారం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో ఇతర పార్టీలు కూడా దీనిపై చర్చ జరగాలని, ఈ బిల్లుపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టాయి. నిబంధనల ప్రకారం ప్రైవేటు మెంబర్ బిల్లును శుక్రవారం మాత్రమే చేపట్టడానికి వీలుంటుందని, నిబంధనల ప్రకారమైతే చర్చించడానికి వీలుంటుందంటూ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ ైజైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో రూపంలో నోటీసు ఇచ్చినట్టయితే చర్చకు సిద్ధమని మరో మంత్రి నఖ్వీ తెలిపారు.
 
 ఈ అంశంపై మరోసారి నోటీసు ఇవ్వాలని, నిబంధనల మేరకు దాన్ని చేపడుతామని డిప్యూటీ చైర్మన్ చెప్పారు. దాంతో విపక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటానని డిప్యూటీ చైర్మన్ తోసిపుచ్చడంతో సభ్యులంతా పోడియం వద్దకు వెళ్లి తమ నిరసన తెలియజేశారు. పోడియం చుట్టుముట్టిన విపక్ష సభ్యులు తమకు న్యాయం జరగాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
 
 ఎంతగా వారించినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభను బుధవారం నాటికి వాయిదా వేశారు.

>
మరిన్ని వార్తలు