రాష్ట్రంలో యథేచ్ఛగా పప్పు ధాన్యాల బ్లాక్ దందా!

17 May, 2016 04:12 IST|Sakshi
రాష్ట్రంలో యథేచ్ఛగా పప్పు ధాన్యాల బ్లాక్ దందా!

కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా సాగుతున్న అక్రమ రవాణా

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖకు నిర్దేశిత 5 శాతం పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి జీరో దందా రూపంలో పప్పులను రాష్ట్రానికి తరలిస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు, కాన్వాసింగ్ ఏజెంట్లు, బ్రోకర్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తుల ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.10వేల కోట్ల విలువైన పప్పులు దిగుమతి అవుతుండగా, అందులో 30% సరుకుకే పన్ను వసూలవుతోంది.  

 ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా
 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని వాంఖిడి, భైంసా, మద్నూర్, చిరాగ్‌పల్లి చెక్‌పోస్టుల ద్వారానే అక్రమ రవాణా సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పప్పులపై పన్ను (వ్యాట్) లేకపోవడం, మన రాష్ట్రంలో 5 శాతం పన్ను విధిస్తుండడంతో చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని మేనేజ్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయల విలువైన పప్పులను రాష్ట్రానికి తరలిస్తుండడం గమనార్హం. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలివస్తున్న పప్పుల అక్రమ రవాణా వెనుక ప్రధాన హస్తం కమీషన్ ఏజెంట్లదేనని అధికారులు గుర్తించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల దొంగ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లతో రాష్ట్రంలోకి ప్రవేశించే ట్రక్కులు కొన్నైతే, ఎలాంటి కాగితాలు లేకుండానే కంది, మినప, పెసర తదితర పప్పులను రవాణా చేయడం ద్వారా ఏజెంట్లు కోట్లకు పడగలెత్తారు.  

 అక్రమ వ్యాపారంపై అధికారుల కన్ను
 రాష్ట్రానికి తరలివస్తున్న పప్పు ధాన్యాలకు, మార్కెట్లలోని నిల్వలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో పౌరసరఫరాల శాఖ ఈ ఏడాది మార్చిలో వాణిజ్యపన్నుల శాఖను అప్రమత్తం చేసింది. ఏకంగా మంత్రి ఈట ల రాజేందర్, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో వాణిజ్యపన్నుల శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వినియోగమయ్యే పప్పులకు 5 శాతం పన్ను కింద కనీసం రూ.500 కోట్ల వరకు రావలసి ఉండగా, 2015-16లో కేవలం రూ.163 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఇటీవ ల ఒకేరోజు 60 బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్లపై దాడికి దిగారు. వారి రికార్డులను పరిశీలిస్తే రూ.10వేల కోట్లకు పైగా విలువైన పప్పు ధాన్యాలు రాష్ట్రానికి తరలివచ్చినట్లు ప్రాథమికంగా తేలింది.

మరిన్ని వార్తలు