బడులను ఎందుకు మూస్తున్నారు?

6 May, 2016 03:51 IST|Sakshi
బడులను ఎందుకు మూస్తున్నారు?

రంగారెడ్డి జిల్లాలో పలు పాఠశాలలను పరిశీలించిన సుప్రీంకోర్టు బృందం
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివరాల సేకరణ

 
 
కందుకూరు/ మంచాల:  స్కూళ్ల మూసివేతపై ఆరా తీసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించింది. కందుకూరు మం డలం పులిమామిడిలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాల, నేదునూరు  ఉర్దూ పాఠశాలలను కమిటీ చైర్మన్ అశోక్‌గుప్తా, సభ్యులు వెంకటేశ్వరరావు, రత్నం, తెలంగాణ పేరెంట్స్ ఫౌండేషన్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ సందర్శించారు.  గ్రామంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు? ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత మంది ఉన్నారని బృందం ఆరా తీసింది.

ఇక్కడ ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో పిల్లల్ని ఇతర పాఠశాలల్లో చేర్పించామని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై కమిటీ సభ్యులు అధికారుల్ని ప్రశ్నించగా  తక్కువ సంఖ్య ఉండటంతో ఇక్కడివారిని అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభు త్వపాఠశాలలో కలిపామని చెప్పారు. మళ్లీ ఉపాధ్యాయుల్ని నియమించి తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులు చేరతారా అని ప్రశ్నించగా సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడే చది విస్తామని తల్లిదండ్రులు బదులిచ్చారు.

నేదునూరులోని ఉర్దూ మీడియం పాఠశాల టీచర్ మెటర్నటీ సెలవుపై వెళ్లడంతో ఇక్కడ చదివే పిల్లలు ఇతర పాఠశాలల్లో చేరడంతో పాఠశాల బంద్ అయిందని తల్లిదండ్రులు తెలిపారు. సమయాభావం వల్ల దాసర్లపల్లి, కటికపల్లిలోని పాఠశాలలను సందర్శిం చకుండానే వారు వెనుదిరిగారు. అనంతరం మంచాల మండలం ఆరుట్ల దళితవాడ-2, బుగ్గ తండా పాఠశాల, కొర్రం తండా ప్రాథమిక పాఠశాలను కమిటీ సందర్శించగా టీచర్లు సకాలంలో రావడంలేదని, ఏకోపాధ్యాయులు ఉన్న చోట ఇబ్బందులున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

>
మరిన్ని వార్తలు