ఢిల్లీకి ర్యాంకింగ్ పంచాయితీ

12 Jul, 2016 03:21 IST|Sakshi
ఢిల్లీకి ర్యాంకింగ్ పంచాయితీ

డిప్‌కు ఆధారాలు సమర్పించిన పరిశ్రమల కమిషనర్
 
 సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందంటూ ఆరోపించిన తెలంగాణ.. ఈ అంశాన్ని మరింత బలంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయింది. ‘ఏపీ.. కాపీ’ వ్యవహారంపై ఇప్పటికే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు.. అందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డిప్) సమర్పించింది. తాజాగా కాపీ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సమర్పించడంతో పాటు.. ర్యాంకింగ్‌లో పూర్తి పారదర్శకతను పాటించాలని కోరేందుకు పరిశ్రమల శాఖ కమిషనర్ మానిక్‌రాజ్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.

మరోవైపు తమ న్యాయ శాఖకు చెందిన ‘కమర్షియల్ కోర్ట్ ఫీ అండ్ ప్రాసెస్ ఫీ ఆన్‌లైన్ పేమెంట్’ అప్లికేషన్‌ను ఏపీ అధికారులు మక్కికి మక్కి కాపీ కొట్టి అప్‌లోడ్ చేశారని పరిశ్రమల శాఖ అధికారులు ఈ నెల ఐదో తేదీన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కాపీరైట్ యాక్టు సెక్షన్ 63 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు, సమాచారాన్ని అప్‌లోడ్ చేసిన కన్సల్టెన్సీ ప్రతినిధుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పక్షాన ఈవోడీబీ నివేదికలు రూపొందించిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. సర్వీస్ కన్సల్టెన్సీ కేపీఎంజీ ప్రతినిధులు కూడా సోమవారం సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరై నివేదికలు రూపొందించిన తీరును వివరించినట్లు తెలిసింది.

 రెండో ర్యాంకుకు ఏపీ...
 అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంకు.. రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోంది. కాపీ వ్యవహారంపై ఫిర్యాదు నమోదయ్యే నాటికి 51.93 శాతం స్కోర్‌తో తెలంగాణ రెండో స్థానంలో.. 51.76 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్ ప్రకారం డిప్ డ్యాష్ బోర్డులో 52.94 శాతం స్కోర్‌తో ఏపీ రెండో స్థానంలోనూ.. 52.52 శాతం స్కోర్‌తో తెలంగాణ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. నెలాఖరులోగా ప్రపంచ బ్యాంకు ఈవోడీబీ తుది ర్యాంకులను ప్రకటిస్తుంది.

మరిన్ని వార్తలు